Reading Time: 2 minutes
Off The Record About Kalva Srinivasulu Vs Poola Nagaraju Internal Tdp Politics In Anantapur Explained

Off The Record: అనంతపురం జిల్లా టీడీపీ నేతల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వివాదాలు రేగుతుండగా, మరికొన్ని చోట్ల సమసిపోయాయనుకున్న విభేదాలు తిరిగి పురుడు పోసుకుంటున్నాయి. ప్రస్తుతం జిల్లాకు చెందినఇద్దరు కీలన నేతల మధ్య ఇలాంటిదే జరుగుతోందట. రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడైన పూల నాగరాజు మధ్య పాత పగలు మళ్లీ రేగుతున్నాయట. ఇద్దరూ రాయదుర్గం నియోజకవర్గానికి చెందిన వారే. పైగా ఇద్దరిదీ…ఒకటే బలమైన బోయ సామాజికవర్గమే. ఒకప్పుడు బాగా సఖ్యతగా ఉన్న ఇద్దరి మధ్య ఇప్పుడు పైకి కనిపించని అంతరం పెరిగిందని అంటున్నారు. కాల్వ శ్రీనివాసులు జిల్లాలో సీనియర్ నాయకుడు. ఒకసారి ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రిగా, చీఫ్ విప్ గా పని చేశారు. పార్టీ పొలిట్ బ్యూరోలో కూడా కీలకంగా ఉన్న నేత. చంద్రబాబుకు నమ్మిన బంటు అని చెబుతారు. పైగా… టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. వివాద రహితుడని, అందర్నీ సమన్వయం చేసుకుని పోతుంటారన్న అభిప్రాయం ఉంది.

ఇక ప్రస్తుత జిల్లా ప్రెసిడెంట్‌ పూల నాగరాజు విషయానికొస్తే…. ఆయన పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకుడిగా ఉండే వారు. జడ్పీటీసీగా గెలిచి బలమున్న నేత అని ప్రూవ్ చేసుకున్నారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చాక నాగరాజును జడ్పీ ఛైర్మన్ చేయాలని కాల్వ శ్రీనివాసులు గట్టిగా ప్రయత్నించారు. మొదటి టర్మ్‌లో ఛాన్స్ రాకపోయినా రెండవ సారి మాత్రం నాగరాదుకు ఆ అవకాశం దక్కింది. ఆ తర్వాత 2019ఎన్నికల్లో రాయదుర్గం టిక్కెట్‌ కోసం టీడీపీలో పోటీ ఏర్పడింది. బోయ సామాజికవర్గానికే చెందిన నాగరాజు కూడా పోటీ పడ్డట్టు అప్పట్లో చెప్పుకున్నారు. టీడీపీ అధిష్టానం మాత్రం ఫైనల్‌గా కాల్వ వైపే మొగ్గింది. కానీ… అప్పుడు జగన్ వేవ్ లో ఓటమి తప్పలేదు. అలాగే అప్పుడు సొంత పార్టీ నేతలే కాల్వ శ్రీనివాసులుకు వ్యతిరేకంగా పని చేసినట్టు కూడా చెప్పుకున్నారు. అది నాగరాజేనన్న అనుమానంతో ఇద్దరి మధ్య అంతరం ఏర్పడింది. ఒకప్పుడు కలిసి పనిచేసిన ఈ ఇద్దరు తర్వాత ఎడమెహం పెడమోహంగా మారిపోయారు. కానీ ఎప్పుడూ బహిరంగంగా పరస్పర విమర్శలు చేసుకోలేదు.

ఇక 2024లో కూడా నాగరాజు టిక్కెట్‌ కోసం ట్రై చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ అధిష్టానం మరోసారి కాల్వకే ఇచ్చింది. ఈ ఎన్నికల్లో శ్రీనివాసులు భారీ మెజార్టీతో విజయం సాధించారు. విప్‌గా అవకాశం దక్కింది. ఇటు నాగరాజుకు ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ పదవి వచ్చింది. ఈ క్రమంలో జిల్లా అధ్యక్ష పదవికి కాల్వే కరెక్ట్‌ అని పార్టీ పెద్దలు భావించినా… ఆయన నిరాకరించారట. ఇందుకు జిల్లా టీడీపీలో ఉన్న పరిస్థితులే కారణమని అంటారు. తనకు వద్దని, ఎవరికి ఇచ్చినా అభ్యంతరం లేదని చెప్పారట కాల్వ. కానీ ఎవరూ ఊహించని విధంగా ఇప్పుడు ఆ పదవి పూల నాగరాజును వరించింది. అయితే జిల్లాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది కత్తి మీద సామేనని అంటున్నారు. పైగా కీలక నేత కాల్వ శ్రీనివాసులు తో చాలా గ్యాప్ ఉంది. ఇంకో వైపు ఇదే సామాజిక వర్గానికి చెందిన గుమ్మనూరు జయరాం కూడా నాగరాజుతో అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద కొత్త అధ్యక్షుడికి, సొంత సామాజిక వర్గానికి చెందిన సీనియర్‌ లీడర్స్‌కు మధ్య గ్యాప్‌ బాగా ఉందని, ఆయన దాన్ని పూరించుకోవడంతోపాటు మిగతా కొన్ని నియోజకవర్గాల్లో ఉన్న పంచాయితీల్ని తేల్చడం అంత ఈజీ కాదన్నది అనంతపురం పొలిటికల్‌ టాక్‌.