Reading Time: < 1 minute
Pakistan Cricket Crisis Pcb Fine Players Mike Hesson Revolt 2026

Pakistan Cricket: T20 ప్రపంచ కప్‌లో ఘోర పరాజయాలు పాకిస్తాన్ క్రికెట్‌లో సంక్షోభానికి కారణమవుతున్నాయి. భారత్‌పై ఓడిపోవడమే కాకుండా, సెమీస్‌కు క్వాలిఫై అవ్వకపోవడంపై పాక్ మాజీలు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, టీమ్ సభ్యులపై విరుచుకుపడుతున్నారు. పాక్ క్రికెటర్ల పేలవమైన ఆటతీరుకు గానూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్(పీసీబీ) భారీ జరిమానాను వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు కెప్టెన్‌‌‌ను తొలగించవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

Read Also: AP Crime: పేకాటలో బాకీ వివాదం.. స్నేహితుడిని తుపాకీతో కాల్చి చంపిన యువకుడు..

పాక్ ఘోర ఆటతీరు, పరాజయాలకు కోచ్ మైక్ హెస్సెన్‌పై మాజీలు విమర్శలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆటగాళ్లు కోచ్‌పై తిరుగుబాటు చేస్తున్నారని తెలుస్తోంది. టోర్నమెంట్ సమయంలో కోచ్ ప్రవర్తనపై ఆటగాళ్లు వ్యక్తిగతంగా పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారని అక్కడి మీడియా చెబుతోంది. అతడి కఠినమైన విధానాలు, సంప్రదింపులు లేకుండా తీసుకున్న నిర్ణయాలు డ్రెస్సింగ్ రూంలో వాతావరణాన్ని దెబ్బతీశాయని ఆరోపిస్తున్నారు. కెప్టెన్‌ను సంప్రదించకుండానే కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారని, హెస్సెన్ తరుచుగా జట్టు నిర్వహణ అంశాల్లో జోక్యం చేసుకుంటున్నారని కూడా పేర్కొన్నారు.

సీనియర్ అధికారులు ప్రస్తుతం కోచ్ హెస్సెన్‌ ప్రవర్తనపై సమీక్షిస్తున్నారు. కోచ్‌తో వివరణాత్మక చర్చలు జరిపే ముందు టూర్ నివేదికను పరిశీలించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సెలక్షన్ ప్యానెల్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా ఇద్దరూ హెస్సెన్ అధికారాన్ని సవాలు చేయలేకపోయారని, కోచ్ జట్టు వ్యవహారాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉన్నారని తెలుస్తోంది. అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో హెస్సెన్ ను పీసీబీ తొలగించకపోవచ్చు. అతడితో పీసీబీకి 2 ఏళ్ల ఒప్పందం ఉంది.