Reading Time: < 1 minute
Ap Assembly 2026 Andhra Pradesh Assembly Session Resumes Amid Key Debates

నాలుగు రోజుల విరామం అనంతరం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో సభా కార్యక్రమాలు మొదలుకానున్నాయి. వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై సభ్యులు ప్రభుత్వాన్ని ప్రశ్నించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో వి.బి.జి రామ్ జీ జాబ్ కార్డులు, పీపీపీ మోడల్ కింద ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలు, రెవిన్యూ శాఖలో పెండింగ్‌లో ఉన్న కేసులు వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.

Also Read: YS Jagan: నేడు అరకు, విశాఖలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన!

అలాగే సింహాచలం పంచగ్రామాలలో అనధికారిక నిర్మాణాలు, విశాఖపట్నం జిల్లాలో పరిశ్రమల అభివృద్ధి అంశాలపై కూడా సభ్యులు ప్రశ్నలు అడగనున్నారు. కోనసీమ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు, వరి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, గృహ నిర్మాణ కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత వంటి ప్రజాసంబంధిత అంశాలు కూడా సభలో చర్చకు రానున్నాయి. అదనంగా విశాఖ ఉక్కు కర్మాగారం భవిష్యత్తు, 2014-2019 మధ్య నిర్మించిన పక్కా గృహాల బిల్లుల చెల్లింపులపై సభ్యులు వివరణ కోరనున్నారు. ఇవే కాకుండా వివిధ శాఖల డిమాండ్లు, గ్రాంట్లపై కూడా సభలో విస్తృత చర్చ జరగనుంది. కీలక అంశాలపై ప్రభుత్వ సమాధానాలు, ప్రతిపక్ష విమర్శలతో సభలో హాట్ హాట్ చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.