
కరీంనగర్ నగరంలో సంచలనం సృష్టించిన భగత్‌నగర్ దోపిడి కేసును కరీంనగర్ పోలీసులు ఛేదించారు. ఇవాళ మీడియా ముందు వివరాలు వెల్లడించిన కరీంనగర్ డీసీపీ వెంకటరమణ.. ఈ దోపిడీకి బాధితుడి సొంత అల్లుడు, మనుమడే ప్రధాన సూత్రధారులుగా తేల్చారు.
బాధితుడు అజ్మత్ అలీ ఇంట్లో నగదు, బంగారం ఉన్నట్లు ముందే సమాచారం సేకరించిన అల్లుడు రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజాతో కలిసి ఈ కుట్రకు తెరలేపాడు. వ్యాపారంలో నష్టపోయి మామను రూ. 5 లక్షలు అడగ్గా, ఇవ్వకపోవడంతో కక్ష పెంచుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ముగ్గురు నిందితులతో కలిసి జులై 21న అర్ధరాత్రి డమ్మీ పిస్టళ్లు, కత్తులతో ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యుల కాళ్లు, చేతులు కట్టేసి భారీగా నగదు, బంగారం, వెండిని దోచుకెళ్లారు.
పోలీసుల కన్ను తమపై పడిందని పసిగట్టిన అల్లుడు, మనవడు గతంలో ఉన్న మరో హత్య కేసులో మీరట్ పోలీసులకు లొంగిపోయారు. అయితే, సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో రంగంలోకి దిగిన కరీంనగర్ పోలీసులు.. యూపీ పోలీసుల సహకారంతో మీరట్‌లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి ముగ్గురు నిందితులను రైల్వే స్టేషన్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2లక్షల 9 వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండిని స్వాధీనం చేసుకున్నారు.
అరెస్టయిన ముగ్గురు నిందితులను ట్రాన్సిట్ వారెంట్‌పై కరీంనగర్‌కు తరలించి రిమాండ్‌కు పంపుతుండగా.. జైల్లో ఉన్న ప్రధాన నిందితులు అల్లుడు రజావుద్దీన్, మనుమడు అజీమ్ రజాలను త్వరలోనే పిటి వారెంట్ పై తీసుకురానున్నట్లు డీసీపీ తెలిపారు. ఈ దొంగతనంలో కుటుంబానికి చెందిన ఓ మహిళ పాత్రపై కూడా అనుమానాలున్నాయని, విచారణలో తేలితే ఆమెపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.