Reading Time: 2 minutes
పొట్టలోని గ్యాస్‌ను తరిమికొట్టే సూపర్ చిట్కాలు.. ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

ఈ ఆధునిక జీవనశైలిలో చాలామందిని వేధించే ప్రధాన సమస్యలలో గ్యాస్ ఒకటి. ఆహారం తిన్న తర్వాత పొట్ట ఉబ్బరంగా అనిపించడం, తేన్పులు రావడం, కడుపులో భారంగా అనిపించడం వంటివి రోజువారీ జీవితంలో సర్వసాధారణమైపోయాయి. కొంతమందికి ఇది కాసేపట్లో తగ్గిపోయినా, మరికొందరికి మాత్రం నిరంతరం నరకం చూపిస్తుంటుంది. అయితే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్లే ఈ సమస్యకు ప్రధాన కారణమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆహారం జీర్ణమయ్యే క్రమంలో కడుపులో గ్యాస్ ఉత్పత్తి కావడం సహజ ప్రక్రియే. కానీ అది పరిమితికి మించితే మాత్రం మన అలవాట్లను ఒక్కసారి సరిచూసుకోవాల్సిన అవసరం ఉందని మెడ్‌లైన్ ప్లస్ నివేదిక తెలిపింది.

గ్యాస్ రావడానికి మనలోని ఈ అలవాట్లే కారణం

మనం దినచర్యలో గమనించకుండా చేసే కొన్ని పనుల వల్ల కడుపులోకి గాలి చేరుతుంది. దాంతో గ్యాస్ సమస్య తీవ్రమవుతుంది. త్వరత్వరగా ఆహారం మింగడం లేదా తింటున్నప్పుడు ఎక్కువగా మాట్లాడటం వల్ల ఆహారంతో పాటు గాలి కూడా పొట్టలోకి వెళ్లిపోతుంది. నమిలే చూయింగ్ గమ్స్, చాక్లెట్లు, హార్డ్ క్యాండీలు చప్పరించడం, స్ట్రా ఉపయోగించి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎక్కువ మోతాదులో గాలి లోపలికి చేరుతుంది. సోడాలు, కార్బోనేటెడ్ కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం కూడా ఒక కారణం. క్యాబేజీ, బ్రోకలీ, బీన్స్, ఉల్లిపాయలు, ఆపిల్స్, పియర్స్ వంటి పండ్లు.. అలాగే కొందరిలో పాలు, డైరీ ఉత్పత్తులు గ్యాస్‌ను పెంచుతాయి. ప్రతిఒక్కరి శరీర తత్వం వేర్వేరుగా ఉంటుంది కాబట్టి.. మీకు ఏ ఆహారం పడటం లేదో గమనించడం ముఖ్యం.

ఉపశమనం పొందడానికి ఏం చేయాలి?

గ్యాస్ వేధింపుల నుంచి బయటపడటానికి వైద్యులు కొన్ని ఎఫెక్టివ్ చిట్కాలను సూచిస్తున్నారు.

నమిలి తినండి: ఆహారాన్ని నమిలి, చాలా నెమ్మదిగా తినాలి. తింటున్నప్పుడు అనవసరంగా మాట్లాడకపోవడం మంచిది.

ఆహారంలో మార్పులు: ఏ పదార్థాలు తిన్నప్పుడు గ్యాస్ ఎక్కువవుతుందో గుర్తించి, వాటిని కొన్ని రోజుల పాటు దూరంగా ఉంచాలి.

నడక ముఖ్యం: రోజులో సరిపడా మంచి నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఆహారం తిన్న వెంటనే పడుకోకుండా కాసేపు తేలికపాటి నడక కొనసాగించాలి.

నిపుణుల సలహా: పాలు తాగినప్పుడు లేదా డైరీ ప్రొడక్ట్స్ వల్ల గ్యాస్ వస్తున్నట్లయితే వైద్యులను సంప్రదించి ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి.

తీవ్రమైన వ్యాధులకు సంకేతం కావచ్చు..

సాధారణంగా వచ్చే గ్యాస్ సమస్య పెద్ద ప్రమాదకరం కాదు. కానీ గ్యాస్‌తో పాటు ఈ క్రింది లక్షణాలు కూడా కనిపిస్తుంటే మాత్రం వెంటనే వైద్యులను సంప్రదించాలి.

  • తీవ్రమైన కడుపు నొప్పి
  • నిరంతరం పొట్ట ఉబ్బరంగా ఉండటం
  • వరుసగా విరేచనాలు లేదా మలబద్ధకం
  • హఠాత్తుగా బరువు తగ్గిపోవడం
  • వాంతులు, మలంలో రక్తం పడటం, మింగడంలో ఇబ్బంది

పదే పదే తీవ్రమైన గ్యాస్ వేధిస్తుంటే అది కేవలం జీర్ణక్రియ లోపం మాత్రమే కాకపోవచ్చు. ఇరిటబుల్ బావెల్ సిండ్రోమ్, సీలియాక్ డిసీజ్ లేదా లాక్టోజ్ ఇంటాలరెన్స్ వంటి జీర్ణకోశ వ్యాధుల సంకేతం కావచ్చు. కాబట్టి నిర్లక్ష్యం చేయకుండా సరైన సమయంలో డాక్టర్‌ను కలవడం మంచిది.