Reading Time: 2 minutes
రాత్రి భోజనం మానేస్తే ఫ్యాటీ లివర్ తగ్గిపోతుందా? నిపుణులు చెప్పిన అసలు నిజం ఇదే!

ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ (Fatty Liver) సమస్య వేగంగా పెరుగుతోంది. ప్రారంభ దశలో ఈ వ్యాధికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే సమయానికి చికిత్స తీసుకోకపోతే ఇది కాలేయ వాపు (NASH), ఫైబ్రోసిస్, లివర్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన సమస్యలకు, కొన్ని సందర్భాల్లో కాలేయ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు. ఈ నేపథ్యంలో చాలా మందిలో ఒక సందేహం ఉంటుంది. ముఖ్యంగా రాత్రి భోజనం మానేస్తే ఫ్యాటీ లివర్ పూర్తిగా తగ్గుతుందా? దీనిపై కాలేయ నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం..

రాత్రి భోజనం మానేస్తే ఫ్యాటీ లివర్ నయమవుతుందా?

కాలేయ నిపుణుల అభిప్రాయం ప్రకారం రాత్రి భోజనాన్ని పూర్తిగా మానేయడం వల్ల ఫ్యాటీ లివర్ నయమవుతుందనే శాస్త్రీయ ఆధారాలు లేవు. భోజనం మానేయడం కంటే సరైన సమయంలో, మితంగా, సమతుల్య ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యమని వారు సూచిస్తున్నారు. అలాగే అర్థరాత్రి వరకు మేల్కొని ఆలస్యంగా భోజనం చేయకుండా, రోజంతా తీసుకునే మొత్తం కేలరీలను నియంత్రించడం ద్వారా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం ఎందుకు ప్రమాదకరం?

  • అవసరానికి మించి ఆహారం తీసుకునే అవకాశం పెరుగుతుంది.
  • అదనపు కేలరీలు శరీరంలో కొవ్వుగా నిల్వ అవుతాయి.
  • కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదం పెరుగుతుంది.
  • జీర్ణక్రియ మందగిస్తుంది.
  • శరీర జీవక్రియ (మెటబాలిజం) దెబ్బతినే అవకాశం ఉంటుంది.
  • అందుకే నిద్రపోయే సమయానికి కనీసం 2–3 గంటల ముందే రాత్రి భోజనం ముగించడం ఉత్తమం.

ఫ్యాటీ లివర్‌ను నియంత్రించడానికి పాటించాల్సిన ముఖ్యమైన అలవాట్లు

అధిక బరువు ఉన్నవారు తమ మొత్తం శరీర బరువులో 7–10 శాతం తగ్గించగలిగితే, కాలేయంలోని కొవ్వు గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేగంగా నడక, సైక్లింగ్, ఈత, యోగా, బలవర్ధక వ్యాయామాలు వంటి మధ్యస్థ తీవ్రత గల వ్యాయామాలను వారానికి కనీసం 150–300 నిమిషాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. శీతల పానీయాలు, ప్యాకెట్ జ్యూస్‌లు, కేకులు, బిస్కెట్లు, స్వీట్లు, ఫ్రక్టోజ్ అధికంగా ఉండే ఆహారాలను తగ్గించడం మంచిది. పప్పులు, పాలు, పెరుగు, పనీర్, గుడ్లు, చేపలు, సోయా, మొలకెత్తిన ధాన్యాలు వంటి ప్రోటీన్ ఆహారాలు కండరాలను బలోపేతం చేయడమే కాకుండా బరువు నియంత్రణలో కూడా సహాయపడతాయి. మద్యం కాలేయాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఫ్యాటీ లివర్ ఉన్నవారు వీలైనంత వరకు మద్యపానాన్ని పూర్తిగా మానేయడం మంచిది.

ఫ్యాటీ లివర్ సాధారణంగా ఈ క్రింది లక్షణాలు ఉంటాయి. అవేంటంటే..

  • నిరంతర అలసట
  • పొత్తికడుపు కుడివైపున అసౌకర్యం, నొప్పి
  • బరువు పెరగడం
  • జీర్ణ సమస్యలు
  • ఆకలి తగ్గిపోవడం

ఫ్యాటీ లివర్‌కు రాత్రి భోజనం మానేయడం ఒక్కటే పరిష్కారం కాదు. సమతుల్య ఆహారం, సరైన సమయానికి భోజనం, క్రమం తప్పకుండా వ్యాయామం, బరువు నియంత్రణ, మద్యానికి దూరంగా ఉండటం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లే ఈ సమస్యను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. లక్షణాలు కనిపిస్తే స్వయంగా చికిత్స చేసుకోవడం కంటే వైద్యుడి సలహా తీసుకోవడం ఉత్తమం.