Reading Time: < 1 minute

సీఎం ఒమర్ అబ్దుల్లా దంపతులకు విడాకులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీం కోర్టు పరిష్కారం

Caption of Image.

జమ్మూ కాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా-పాయల్ అబ్దుల్లా దంపతుల 17 ఏళ్ల ఎడబాటుకు ఎండ్ కార్డ్ పడింది. సుదీర్ఘంగా కొనసాగుతూ వస్తున్న విడాకుల వివాదం స్నేహపూర్వకంగా పరిష్కారమైంది. శుక్రవారం (జులై 31, 2026) విడాకులకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది .

జస్టిస్ పి.ఎస్. నరసింహ, జస్టిస్ అలోక్ అరాధే బెంచ్ దంపతులకు విడాకులకు అనుమతించడంతో వివాదం ముగిసింది.  ఈ కేసులో వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ .. ఇద్దరూ పరస్పరం విడాకులకు అంగీకరించారని.. అన్ని వివాదాలు స్నేహపూర్వకంగా పరిష్కారమయ్యాయని కోర్టుకు చెప్పారు.  మిగిలిన కేసులన్నీ ఉపసంహరించుకుంటామని కోర్టుకు చెప్పడంతో.. బెంచ్ దీన్ని అంగీకరించింది.

ఓమర్ అబ్దుల్లా, పాయల్ 1994 సెప్టెంబర్‌లో వివాహం చేసుకున్నారు. చాలా కాలంగా వేర్వేరుగా ఉంటున్నారు. ఓమర్ 2016లో ఫ్యామిలీ కోర్టులో విడాకులు కోరగా, ఆ అప్పీల్ 2023లో ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తన భార్య తనను విడిచి వెళ్లిపోయిందని.. ఇది మానసిక  క్రూరత్వం అని ఆయన ఆరోపించారు. ఈ ఆరోపణలు అస్పష్టమని, ఆధారాలు లేవని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఇటీవల జులై 22న ఇద్దరూ ఆర్టికల్ 142 కింద మ్యూచువల్ కన్సెంట్‌తో విడాకులు కోరుతూ అప్లికేషన్ దాఖలు చేశారు.

ఈ తీర్పుతో ఇద్దరూ స్వంతంత్రంగా విడిగా ఉండేందుకు మార్గం సుగమమైంది. వారి ఇద్దరు కుమారుల చదువు, ఇతర విషయాలపై ముందస్తుగా ఒప్పందాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.