
రాత్రికి రాత్రే స్పెయిన్‌ను వలసలు ముంచెత్తాయి. గంటల వ్యవధిలోనే 60 వేల మంది వలసదారులు దండెత్తారు. దీంతో స్పెయిన్ వలస సంక్షోభం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా స్పెయిన్ వలస సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డెమోక్రటిక్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికాలోనూ ఇలాంటి పరిస్థితులే తలెత్తుతాయని హెచ్చరించారు. ఉత్తర ఆఫ్రికాలోని స్పెయిన్ భూభాగం సియుటాలోకి భారీ సంఖ్యలో వలసదారులు ప్రవేశిస్తున్న దృశ్యాలను ప్రస్తావిస్తూ.. అక్కడి పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.

శుక్రవారం ట్రంప్ మాట్లాడుతూ.. ‘‘అక్కడి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆ దృశ్యాన్ని గుర్తుంచుకోండి. తప్పుడు పార్టీ అధికారంలోకి వస్తే మరో మూడేళ్లలో అమెరికాలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. డెమోక్రాట్లు అధికారంలోకి వస్తే ప్రజలు మంచి జీవితాన్ని గడపలేరు’’ అని వ్యాఖ్యానించినట్లు ఫాక్స్ న్యూస్ తెలిపింది.
మొరాకో ఉత్తర తీరానికి సమీపంలో ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన స్పెయిన్ ప్రాంతం సియుటాలోకి గత రెండు, మూడు రోజుల వ్యవధిలో సుమారు 60 వేల మంది వలసదారులు ప్రవేశించినట్లు ప్రాంతీయ అధ్యక్షుడు జువాన్ జీసస్ వివాస్ తెలిపారు. సియుటా నగర జనాభా సుమారు 80 వేలుగా ఉండగా.. కొద్ది రోజుల్లోనే 60 వేల మంది వలసదారులు రావడం స్థానిక అధికారులకు తీవ్ర సవాలుగా మారింది. వలస వ్యవహారాల నిపుణుడు ఇగ్నాసియో సెంబ్రెరో ఏఎఫ్‌పీతో మాట్లాడుతూ.. వలసదారుల రాక గరిష్ఠ స్థాయికి చేరిన సమయంలో ప్రతి నిమిషానికి దాదాపు 200 మంది సియుటాలోకి ప్రవేశించారని తెలిపారు. భారీ సంఖ్యలో వలసదారులు రావడంతో స్థానిక అధికారులు పరిస్థితిని నియంత్రించలేకపోయారని పేర్కొన్నారు.
అయితే స్పెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇప్పటివరకు సుమారు 25 వేల మంది వలసదారులు తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు. అయినప్పటికీ సియుటాలోకి వచ్చిన వలసదారుల సంఖ్య 2021 మేలో ఏర్పడిన సంక్షోభాన్ని మించిపోయిందని అధికారులు తెలిపారు. ఆ సమయంలో కొన్ని రోజుల వ్యవధిలో దాదాపు 12 వేల మంది సియుటా సరిహద్దును దాటారు. ప్రస్తుతం నమోదైన వలసదారుల ప్రవాహం ఆ ఘటన కంటే చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు.
ఈ భారీ వలసదారుల ప్రవాహంలో మొరాకో పాత్రపై కూడా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మొరాకో భద్రతా బలగాలు పరిస్థితిని నియంత్రించేందుకు సరైన చర్యలు తీసుకోలేదని వలస వ్యవహారాల నిపుణుడు సెంబ్రెరో ఆరోపించారు. మొరాకో అధికారులు అనుమతించకుండా ఇంత భారీ సంఖ్యలో వలసదారులు సరిహద్దుకు చేరుకోవడం సాధ్యం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సియుటా, మెలిల్లా అబ్జర్వేటరీ అధిపతి కార్లోస్ ఎచెవెర్రియా మాట్లాడుతూ.. వేలాది మంది ఒకేసారి అంతర్జాతీయ సరిహద్దును అక్రమంగా దాటి పొరుగు దేశంపై ఒత్తిడి తీసుకొస్తున్నందున.. ఈ పరిస్థితిని ‘‘దాడి’’గా అభివర్ణించడానికి కూడా అవకాశం ఉందని పేర్కొన్నారు.
సియుటా వలస సంక్షోభానికి పలు కారణాలు ఉండవచ్చని ఏఎఫ్‌పీతో మాట్లాడిన నిపుణులు తెలిపారు. సముద్ర మార్గం ద్వారా స్పెయిన్‌కు చేరుకున్న వలసదారులను వెంటనే వెనక్కి పంపడంపై పరిమితులు విధిస్తూ జూలై 8న స్పెయిన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఇటీవల అమలులోకి వచ్చిన వలస విధానాలు ఈ పరిస్థితికి కారణమై ఉండవచ్చని విశ్లేషించారు.
అదే సమయంలో సియుటా, మెలిల్లా ప్రాంతాలపై తమకు ఉన్న దీర్ఘకాలిక ప్రాదేశిక హక్కుల డిమాండ్‌ను మళ్లీ తెరపైకి తీసుకురావడానికి మొరాకో వలసదారుల ఒత్తిడిని ఉపయోగించుకుంటోందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. 1956 నుంచి ఈ రెండు ప్రాంతాలపై మొరాకో హక్కులు చేస్తుండగా.. అవి తమ దేశంలో అంతర్భాగాలని స్పెయిన్ స్పష్టం చేస్తోంది. సియుటాలో కొనసాగుతున్న తాజా వలస సంక్షోభం స్పెయిన్-మొరాకో సంబంధాలతో పాటు యూరప్ వలస విధానాలపై మరోసారి చర్చకు దారితీసింది.