
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్ 2’. ఈ మూవీపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2022లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన ‘సర్దార్’కు సీక్వెల్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి మరోసారి దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ ‘సర్దార్ 2’ టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ సినిమాపై ఉన్న అంచనాలను ఒక్కసారిగా రెట్టింపు చేసింది.
టీజర్‌లో కార్తీ మరోసారి రహస్య గూఢచారిగా పవర్‌ఫుల్ అవతార్‌లో కనిపిస్తూ అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్‌లతో ఆకట్టుకున్నాడు. దేశ భద్రతకు ముప్పుగా మారిన అంతర్జాతీయ కుట్రలను ఛేదించే మిషన్ చుట్టూ కథ తిరుగుతున్నట్లు టీజర్ స్పష్టం చేస్తోంది. భారీ యాక్షన్ బ్లాక్స్, హాలీవుడ్ స్థాయి విజువల్స్, ఇంటెన్స్ ఛేజింగ్ సన్నివేశాలు ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమాలో కార్తీ డబుల్ రోల్ లో నటిస్తున్నారు. తండ్రి కొడుకు పాత్రల్లో మెప్పించనున్నారు.
ఈ చిత్రంలో మాళవిక మోహనన్ కథానాయికగా నటిస్తుండగా, ఎస్.జె. సూర్య పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే ఆషిక రంగనాథ్, రాశి ఖన్నా, రజీషా విజయన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మొదటి భాగానికి అద్భుతమైన సంగీతం అందించిన సామ్ సీఎస్ ఈసారి కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లనున్నారని టీజర్‌తోనే స్పష్టమైంది.
ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందించారు. విదేశాల్లో చిత్రీకరించిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ‘సర్దార్ 2’ను సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీతో పాటు పలు భారతీయ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. తొలి భాగాన్ని మించి ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేస్తుందనే నమ్మకంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.