
తెలంగాణలోని కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలను ఏ వ్యవస్థ అడిగినా సులభంగా అందించేలా ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ఫ్యామిలీ సర్టిఫికెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. జులై 31 శుక్రవారం మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ అవగాహన సదస్సులో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు, రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ, సన్నబియ్యం వంటి సంక్షేమ ఫలాలను పొందుతున్న కుటుంబాల వివరాలను తహశీల్దార్ కార్యాలయంలో ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. ఏ కుటుంబానికైనా తమ కుటుంబ సభ్యుల సమాచారం కావాలంటే తహశీల్దార్ కార్యాలయం లేదా మీసేవ కేంద్రం ద్వారా ఈ ఫ్యామిలీ సర్టిఫికెట్ పొందవచ్చని భట్టి విక్రమార్క తెలిపారు. ప్రభుత్వ లేదా ఇతర వ్యవస్థలు వివరాలు కోరినప్పుడు ఈ ధృవీకరణ పత్రం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు.
రేషన్ కార్డు డేటాతో అనుసంధానం
ప్రభుత్వం రూపొందించే ఫ్యామిలీ రిజిస్టర్లో ప్రతి ఫ్యామిలీకి సంబంధించి పక్కా వివరాలను నమోదు చేయనున్నారు. రేషన్ కార్డు నంబర్నే ఈ రిజిస్టర్లో ‘ఫ్యామిలీ రిజిస్టర్ ఐడెంటిఫికేషన్ నంబర్’గా పరిగణిస్తారు. సివిల్ సప్లైస్ కమిషనర్ నిర్వహించే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ డేటాబేస్ నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో వివరాలను సేకరించి ఈ రిజిస్టర్లో పొందుపరుస్తారు.
ఇందులో కుటుంబ యజమాని పేరు, కుటుంబంలోని ప్రతి ఒక్క సభ్యుని పేరు, యజమానితో ఉన్న సంబంధం, వయస్సు, పుట్టిన తేదీ, లింగం, ఆధార్ సంఖ్య, దరఖాస్తుదారు ప్రస్తుతం నివసిస్తున్న చిరునామా (ఇంటి నంబర్, వీధి, గ్రామం, వార్డు, మండలం, జిల్లా) వివరాలు స్పష్టంగా పొందుపరుస్తారు. పౌర సరఫరా శాఖ డేటాబేస్, మీసేవ ప్లాట్ఫామ్ మధ్య సాంకేతిక అనుసంధానం ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ కమిషనర్ను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.
దరఖాస్తు విధానం ఇలా..
కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రం కావాలనుకునే పౌరులు నేరుగా సమీపంలోని మీసేవా కేంద్రం ద్వారా గానీ, లేదంటే మీసేవా ఆన్లైన్ పోర్టల్, మొబైల్ యాప్ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబంలో వయస్సు నిండిన ఏ ఒక్క సభ్యుడైనా ఈ పత్రం కోసం దరఖాస్తు చేసేందుకు అర్హులు. దరఖాస్తు చేసుకున్న తర్వాత మీసేవా వ్యవస్థ ఆటోమేటిక్గా రేషన్ కార్డులోని చిరునామా ఆధారంగా సంబంధిత మండల తహసీల్దార్ లాగిన్కు ఆ దరఖాస్తును పంపుతుంది.