Reading Time: < 1 minute
Telangana Sir Voter Verification Deadline Extended August10

Telangana SIR : తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న ముమ్మర ఓటర్ల పరిశీలన , సవరణ (SIR) ప్రక్రియకు సంబంధించిన గడువును మరోసారి పొడిగిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (CEO) బి. సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, మిగిలిన పనిని ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేయడానికి వీలుగా గడువును ఆగస్టు 10 వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. ఓటర్ల సమాచారాన్ని పక్కాగా నవీకరించడం , అర్హులైన ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.

77% డిజిటలైజేషన్ పూర్తి.. జిల్లాల వారీగా గణాంకాలు

రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇప్పటివరకు 77.12 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని సీఈఓ తెలిపారు. మొత్తం 3,38,26,448 ఓటర్లకు గాను 2,60,88,334 ఫారాల డిజిటలైజేషన్ నమోదైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే యాదాద్రి భువనగిరి జిల్లా 94.25 శాతంతో అగ్రస్థానంలో నిలవగా, జనగామ (91.44%), మెదక్ (90.52%), సూర్యాపేట (90.35%) , మహబూబాబాద్ (90.08%) జిల్లాలు 90 శాతానికి పైగా డిజిటలైజేషన్‌తో అత్యుత్తమ పనితీరును కనబరిచాయి.

మరోవైపు హైదరాబాద్ పరిధిలోని ప్రధాన నగర ప్రాంతాల్లో ఈ ప్రక్రియ కాస్త నెమ్మదిగా సాగుతోంది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61.37 శాతం, రంగా రెడ్డి జిల్లాలో 63.43 శాతం , హైదరాబాద్ జిల్లాలో 56.31 శాతం డిజిటలైజేషన్ నమోదు కాగా, సంగారెడ్డిలో 78.01 శాతం నమోదైంది. ఈ పట్టణ ప్రాంతాలలో కూడా సత్వరమే ప్రక్రియను వేగవంతం చేసేందుకే ఆగస్టు 10 వరకు సమయం ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన గడువులోగా ప్రక్రియను వంద శాతం పూర్తి చేయాలని సంబంధిత సిబ్బందిని సిఈఓ ఆదేశించారు.