Reading Time: < 1 minute

తమిళనాడులో ఎన్నికల ముంగిట మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. దివంగత మాజీ సిఎం జయలలితకు అత్యంత సన్నిహితురాలు అందరూ చిన్నమ్మగా పిలుచుకునే శశికళ నూతన పార్టీని ఏర్పాటు చేశారు. మంగళవారంనాడు రామనాథపురంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలుపు, నలుపు, ఎరుపు మూడు రంగుల్లో పార్టీ జెండాకు రూపకల్పన చేశారు. దివంగత నేతలు అన్నాదురై, ఎంజిఆర్, జయలలిత చిత్రాలు ఉన్నాయి. అయితే పార్టీ పేరును త్వరలో వెల్లడిస్తానని శశికల ప్రకటించారు. తమ పార్టీ పేదలు, అణగారిన వర్గాల కోసం పనిచేస్తుందన్నారు. అన్నాదురై, ఎంజిఆర్, జయలలిత చూపిన మార్గాన్ని అనుసరిస్తామని, వారి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా జయలలిత మరణం గురించి మాట్లాడుతూ శశికళ ఉద్వేగానికి గురయ్యారు. రాబోయే ఎన్నికల్లో తమ సత్తా చాటుతామన్నారు. అంతకుముందు ఉదయం జయలలిత జయంతిని పురస్కరించుకుని సమాధి వద్ద నివాళి అర్పించిన శశికళ త్వరలో ప్రజలు శుభవార్త వింటారని ప్రకటించారు. జయలలిత నెచ్చెలిగా పేరున్న శశికళ ఆమె మరణాంతరం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. ఆ తర్వాత అన్నాడిఎంకే నుంచి బహిష్కృతురాలయ్యారు. జైలు నుంచి విడుదలైన తర్వాత చెన్నై కేంద్రంగా ఉంటున్న శశికళ ఇటీవల రాజకీయ పార్టీ స్థాపనకు వరుస భేటీలు జరుపుతున్నారు. సన్నిహితులతో సమావేశమవుతూ వ్యూహాలు రూపొందించుకుంటున్నారు. అనుచురులు కూడా చిన్నమ్మ నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని చెబుతున్నారు.