July 6, 2026

Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్‌లపై పొంగులేటి ఫైర్

Ponguleti Srinivas Reddy : కాళేశ్వరం పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి.. కేసీఆర్, కేటీఆర్‌లపై పొంగులేటి ఫైర్
Reading Time: 2 minutes
Ponguleti Srinivasa Reddy Kaleshwaram Comments

Ponguleti Srinivas Reddy : సిద్దిపేట వేదికగా రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి లక్షల కోట్ల రూపాయల నిధులు వచ్చాయి కానీ, పేదవాడికి ఒక సొంత ఇల్లు కట్టించి ఇవ్వడానికి మాత్రం వారికి మనసు రాలేదని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది వాళ్లే, దాన్ని ఓపెన్ చేసింది వాళ్లే, చివరకు అది కూలిపోయింది కూడా వాళ్ల హయాంలోనేనని మంత్రి గుర్తుచేశారు. ఇప్పుడు వాళ్లే కాళేశ్వరం దగ్గరకు పోయి తామేదో చేశామంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రాజెక్టులో నీళ్లు నిల్వ ఉంచితే కింద ఉన్న ప్రాంతమంతా కొట్టుకుపోతుందని ఎన్‌డీఎస్‌ఏ (NDSA) హెచ్చరించినా, బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు.

అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలి

ప్రాజెక్టు కట్టినప్పుడు గత పాలకులకు చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే కాళేశ్వరానికి ఈ గతి పట్టేది కాదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దుయ్యబట్టారు. కేవలం అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు మోపడం ఆపాలని హితవు పలికారు. “కాళేశ్వరం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అన్న పెద్దమనిషి (కేసీఆర్) ఇప్పటికైనా అసెంబ్లీకి రావాలి. కాళేశ్వరాన్ని ఎలా కట్టారో సమాధానం చెప్పి.. తాము చేసిన పాపాన్ని అసెంబ్లీ సాక్షిగా కడుక్కోవాలి” అని సవాల్ విసిరారు. వారు ఏవైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే అసెంబ్లీ వేదికగా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, కేసీఆర్ సభకు వచ్చి కాళేశ్వరంపై పూర్తి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

తల తాకట్టు పెట్టి అయినా పేదల ఇళ్ల కల నెరవేరుస్తాం

బీఆర్ఎస్ హయాంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అసంపూర్తిగా కట్టి మధ్యలోనే వదిలేశారని మంత్రి పొంగులేటి ఆరోపించారు. గుడిసెలు లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం వదిలేసిన ఆ అసంపూర్తి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అన్నింటినీ రిపేర్ చేసి త్వరలోనే పేదలకు అందిస్తామని భరోసా ఇచ్చారు. అవసరమైతే తల తాకట్టు పెట్టి అయినా సరే, అర్హులైన ప్రతి పేదవాడి సొంత ఇంటి కలను నెరవేర్చడమే తమ ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పునరుద్ఘాటించారు.