
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను నివారించే హెచ్‌పీవీ వ్యాక్సిన్ ను 14 ఏళ్ల వయసు పైబడిన బాలికలకు ఉచితంగా అందించనున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈమేరకు గార్డాసిల్ ఇంజెక్షన్‌ను ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. నాలుగు రకాల గర్భాశయ క్యాన్సర్‌ను నిరోధించే ఈ వ్యాక్సిన్ ఈ క్యాన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్ 16.18,తోపాటు టైప్ 6,11 రకాల నుంచి రక్షణ కల్పిస్తుందని ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్‌ల నుంచి దీర్ఘకాల రక్షణ కల్పిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్‌లో అందుబాటులో
ఉన్న గార్డాసిల్ 4 టీకాను రెండు డోసుల్లో తీసుకోవలసి ఉంటుంది. ఒక్కో డోసు ధర రూ.3927, అదే 15 ఏళ్ల వయసు పై బడిన బాలికలు మాత్రం మూడు డోసుల్లో తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటు లోకి రాగా, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు గణనీయంగా తగ్గినట్టు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా, వీటిలో 90 దేశాలు సింగిల్ డోసులో అందిస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా, వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నారు.