Reading Time: < 1 minute

ఝార్ఖండ్ లోని చత్రా జిల్లా సిమారియా అడవిలో సోమవారం కూలిపోయిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదానికి సంబంధించి ఏడుగురు మృతుల కుటుంబాలు తీరనిశోకంలో మునిగిపోయాయి. ఏడు మృతదేహాలను మంగళవారం మధ్యాహ్నం ఆయా కుటుంబాలకు అప్పగించారు. మృతుల్లో రోగితోపాఉ అతని కుటుంబ సభ్యులు,పైలట్, కోపైలట్, ఒక వైద్యుడు,పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఛత్రా లోని సాదర్ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ నిర్వహించారు. కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించామని ఆరోగ్యవిభాగం అధికారి వెల్లడించారు. రాంచీ విమానాశ్రయం నుంచి సోమవారం రాత్రి 7.11 గంటలకు బయలుదేరిన ఈ విమానం రాత్రి 7.30 గంటలకు గల్లంతయ్యింది.

బయలుదేరినదాదాపు 20 నిమిషాల తరువాత ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కూలిపోవడానికి ప్రతికూల వాతావరణం కారణం కావచ్చని రాంచీ ఎయిర్‌పోర్టు డైరెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు. కానీ సమగ్రంగా దర్యాప్తు చేస్తేనే కానీ అసలు కారణం తెలీదన్నారు. మృతుల్లో కెప్టెన్ వికాస్ భగత్, కెప్టెన్ సవరాజ్‌దీప్ సింగ్, సంజయ్ కుమార్,డాక్టర్ వికాస్ కుమార్ గుప్తా, సచిన్ కుమార్ మిశ్రా, అర్చనా దేవి, ధురు కుమార్‌లను గుర్తించారు. ఝార్ఖండ్ గవర్నర్ సంతోష్‌కుమార్ గంగ్వార్, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, ఈ ప్రమాదంలో మృతులైన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.