
విద్యుత్ షాక్ కు గురై ఓ చిన్నారి మృతి చెందిన సంఘటన చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండల పరిధిలోని మిర్జగూడ గ్రామానికి చెందిన ఇబ్రహీంపల్లి యాదయ్య – అనిత దంపతులకు కూతురు వర్షిణి (7), కొడుకు రుత్విక్ ఇద్దరు సంతానం. కాగా మంగళవారం చిన్నారులిద్దరూ తమ పెద్దమ్మ మౌనికతో కలిసి పొలానికి వెళ్లారు. చిన్నారుల పెదనాన్న మల్లేష్ తన పొలంలో మొక్కజొన్న పంటను సాగు చేశాడు. అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెను పొలం చుట్టు వేశాడు. చిన్నారులిద్దరు తమ పెద్దమ్మ చేతులను విడిపించుకుని మొక్కజొన్న పంట వేసిన పొలంలోకి పరుగెత్తుకుని వెళ్లారు.
అడవి పందుల బారి నుంచి మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు పెదనాన్న మల్లేష్ వేసిన విద్యుత్ కంచె చిన్నారులిద్దరికి తగిలింది. చిన్నారులిద్దరూ విద్యుత్ షాక్ గురయ్యారు. ఇది గమనించిన పెద్దమ్మ మౌనిక చుట్టు పక్కల రైతుల సహాయంతో చిన్నారులను చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ గురై వర్షిణి(7) అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. షాక్ గురై తీవ్ర గాయాలైన రుత్విక్ ను మెరుగైన వైద్య చికిత్సల కోసం హైదరాబాద్ నగరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన చిన్నారి వర్షిణి చేవెళ్ల మున్సిపల్ కేంద్రంలోని నవ చైతన్య హై స్కూల్ లో చదువుతోందని కుటుంబ సభ్యులు తెలిపారు. అప్పటి వరకు తమ కళ్లముందు ఆడుకున్న చిన్నారులిద్దరిలో ఒకరు విద్యుత్ షాక్ గురై వర్షిణి చనిపోవడాన్ని జీర్ణించుకోలేక కన్నీరు కార్చారు. గాయాల పాలైన చిన్నారి రుత్విక్ ఆరోగ్యం కుదుట పడి తొందరగా ఇంటికి చేరుకోవాలని గ్రామస్తులు కోరుకున్నారు.