Reading Time: < 1 minute
Secunderabad Zomato Delivery Boy Attack Vasavi Nagar

సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని వాసవి నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆర్డర్ లొకేషన్ మ్యాప్‌లో తప్పుగా చూపిస్తుండటంతో కాస్త ఆలస్యంగా ఆహారం అందించేందుకు వచ్చిన ఆశిష్ అనే జొమాటో డెలివరీ బాయ్‌పై ఓ దంపతులు విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. ఆలస్యం కావడంపై ఇరువర్గాల మధ్య మొదట మాటమాట పెరగడంతో, తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త అజయ్ డెలివరీ బాయ్‌పై భౌతిక దాడికి దిగాడు. ఈ గొడవ మరింత ముదరడంతో అతని భార్య కూడా జోక్యం చేసుకుని, ఆశిష్ తలపై హ్యాండ్‌తో బలంగా కొట్టింది. ఈ దాడి దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి.

కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. డెలివరీ బాయ్స్ నిరసన

సహచరుడిపై జరిగిన దాడి వార్త తెలియడంతో తోటి డెలివరీ బాయ్స్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. దాడిని తీవ్రంగా ఖండిస్తూ పెద్ద సంఖ్యలో డెలివరీ బాయ్స్ కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని నిరసనకు దిగారు. బాధితుడికి న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న భర్త అజయ్ కూడా పోలీస్ స్టేషన్‌కు రావడంతో, అక్కడ ఉన్న డెలివరీ బాయ్స్‌కు, అతనికీ మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం, తోపులాట జరిగింది. ఈ పరిణామంతో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల ఫిర్యాదుల మేరకు కార్ఖానా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

‘సెటిల్మెంట్ కోసం బెదిరిస్తున్నారు’.. బాధితుడి ఆవేదన

బాధితుడు ఆశిష్, అతని కుటుంబ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమ కొడుకును చంపేందుకు సదరు దంపతులు ప్రయత్నించారని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాడి అనంతరం ఆశిష్ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ (MLC) చేయించుకున్నట్లు తెలిపారు. తాను స్థానికుడినంటూ బెదిరింపులకు దిగుతున్నారని, కేసును ఉపసంహరించుకోవడానికి డబ్బులు ఆఫర్ చేస్తూ సెటిల్మెంట్ చేసుకోమని ఒత్తిడి తెస్తున్నారని ఆశిష్ ఆరోపించారు. తమకు న్యాయం చేయాల్సిన పోలీసులు కూడా సరిగా సహకరించడం లేదని, నిరసనకు వచ్చిన తోటి డెలివరీ బాయ్స్‌పై కూడా పోలీసులు కేసులు పెట్టారని వాపోయారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని ఆశిష్ కుటుంబం విజ్ఞప్తి చేసింది.