
కృష్ణా జిల్లా వెదురుపావులూరు టోల్ ప్లాజా దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టోల్ ప్లాజా రోడ్డుకు అడ్డంగా 20 టిప్పర్ లారీలు నిలిపేసి హల్చల్ చేశారు డ్రైవర్లు. ఏలూరు నుంచి గుంటూరు వైపు వెళ్లే ఆరు టోల్ గేట్లకు అడ్డంగా లారీలు నిలిపేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. టోల్ ప్లాజా సిబ్బంది ఫీజ్ చెల్లించాలని అడిగితే గవర్నమెంట్ ప్రాజెక్టుకు మట్టి తరలిస్తున్నామంటూ వారితో వాగ్వాదానికి దిగారు.
టోల్ ఫీజులు చెల్లించిన తర్వాతనే లారీలు తీసుకెళ్లాలంటూ సిబ్బంది చెప్పడంతో వారితో వాగ్వాదానికి దిగారు డ్రైవర్లు. గవర్నమెంట్ ప్రాజెక్టుకు మట్టి తరలిస్తున్నామంటూ టోల్ ఫీజ్ చెల్లించేది లేదంటూ సిబ్బందితో వాదనకు దిగారు. సదరు టిప్పర్ డ్రైవర్లు టీడీపీ ఎమ్మెల్యే చింతామననేని అనుచరులుగా తెలుస్తోంది.
ఎంత చెప్పినా డ్రైవర్లు వినకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు టోల్ ప్లాజా సిబ్బంది. ఈ క్రమంలో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు టోల్ చెల్లించి సంబంధిత సంస్థ నుంచి డబ్బులు వసూలు చేసుకోవాలని సూచించి అక్కడి నుంచి డ్రైవర్లను పంపించారు.