
Vijay Deverakonda: సిల్వర్ స్క్రీన్‌పై రౌడీ ఇమేజ్‌తో అదరగొట్టే విజయ్ దేవరకొండ.. తాజా ప్రాజెక్ట్ ‘రణబాలి’ కోసం ఏకంగా ప్రాణాలనే పణంగా పెట్టారన్న చేదు నిజం ఇప్పుడు సినీ ప్రియులను ఉలిక్కిపడేలా చేస్తోంది. కేవలం పాత్రలో జీవించాలన్న తపనతో సెట్స్‌లో ఆయన చేసిన ఓ అత్యంత సాహసోపేతమైన ప్రయోగం, తీవ్రమైన ఆరోగ్య సమస్యకు దారితీసి ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి తీసుకొచ్చింది. అర్ధరాత్రి నిద్రలో ఉన్నట్టుండి శ్వాస ఆగిపోవడం, లంగ్స్ పూర్తిగా మూసుకుపోయినంత పనై ఆస్తమా దాడికి గురైన భయానక క్షణాలను స్వయంగా విజయ్ తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టారు.
డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్ వింటేజ్ రాయలసీమ స్టోరీని ఏమాత్రం ఎక్కడా ఫేక్‌గా లేకుండా తీర్చిదిద్దే క్రమంలో భారీ సెట్స్ వేశారు. ఇందులో భాగంగా వచ్చే ‘కోబలి’ అనే అత్యంత కీలక సన్నివేశం కోసం విజయ్ ఏకంగా 15 రోజుల పాటు నిరంతర నరకం అనుభవించారని చెప్పారు. ఈ సీన్‌లో సుమారు వంద మంది అఘోరాల మధ్య, వందల కేజీల విభూతి, పసుపు ఎడతెగకుండా గాల్లోకి ఎగురుతుండగా విజయ్ మధ్యలో నిలబడి పెర్ఫార్మ్ చేయాల్సి వచ్చింది. ఆ హేజ్ వాతావరణం, వళ్లు గగుర్పొడిచే డస్ట్, శరీరమంతా పూసిన ప్రాస్థెటిక్స్, రక్తపు పూతలు విజయ్ శ్వాస వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆ వరుస రోజుల షూట్ ముగిశాక ఓ రాత్రి విజయ్ నిద్రలేచి చూసేసరికి పరిస్థితి విషమించింది. “ఒక్కసారిగా ఊపిరి అందడం ఆగిపోయింది. లోపలికి గాలి వెళ్లట్లేదు.. బయటకు రావట్లేదు. లంగ్స్ పూర్తిగా బ్రాంకోస్పాజమ్‌కు గురై బిగుసుకుపోయాయి. దెబ్బకు తీవ్రమైన ఆస్తమా బారిన పడ్డాను. సినిమా కోసం ఇంత హజార్డస్ రిస్క్ చేస్తున్నామని తెలిస్తే ఏ పల్మనాలజిస్ట్ అయినా పిచ్చోళ్లని తిడతారు. ఆ రాత్రి నరకం చూశాను” అని విజయ్ గుర్తు చేసుకున్నారు. “దాదాపు చావు అంచుల దాకా వెళ్లే చేదు అనుభవం ఎదురైనా.. వెండితెరపై ఆ సన్నివేశాలు ఇచ్చే అనుభూతి కోసమే ఆ బాధనంతా భరించానని విజయ్ దేవరకొండ తెలిపారు.” యాక్టింగ్ కోసం ఇంతటి రిస్క్ తీసుకుని, లంగ్స్‌ను సైతం దెబ్బతీసుకున్న విజయ్ డెడికేషన్ చూసి ఆయన అభిమానులు ఒకవైపు షాక్ అవుతూనే, మరోవైపు రౌడీ హీరో ప్యాషన్‌కు సెల్యూట్ చేస్తున్నారు.