Reading Time: < 1 minute
Andhra Pradesh Local Body Elections Sec Photo Voter Lists Mpp Zpp

AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు ప్రారంభించింది. మండల పరిషత్ నియోజకవర్గాలు (MPP), జిల్లా పరిషత్ నియోజకవర్గాలకు సంబంధించి ఫోటో ఓటర్ల జాబితాలను సిద్ధం చేసి ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మండల పరిషత్ నియోజకవర్గాల వారీగా ఫోటో ఓటర్ల జాబితాలను తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రచురించాలని ఈ సందర్భంగా అధికారులకు ఎస్‌ఈసీ సూచించింది. అలాగే జిల్లా పరిషత్ నియోజకవర్గాల ఫోటో ఓటర్ల జాబితాలను కూడా రెడీ చేసి ప్రచురించాలని జిల్లా ఎన్నికల అధికారులను (సీఈఓలు) ఆదేశించింది. ఓటర్ల వివరాలను సంబంధిత రికార్డులతో పరిశీలించి జాబితాలను రూపొందించాలని పేర్కొంది.

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో పూర్వపు 13 జిల్లా ప్రజా పరిషత్‌లను 28 జిల్లా ప్రజా పరిషత్‌లుగా పునరుద్ధరించారు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా కొత్తగా ఏర్పడిన జిల్లా పరిషత్ నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి ప్రాధాన్యత ఏర్పడింది. ప్రస్తుత మండల ప్రజా పరిషత్ (MPP), జిల్లా ప్రజా పరిషత్ (ZPP)ల ఐదేళ్ల పదవీకాలం వరుసగా 2026 సెప్టెంబర్ 23, 24 తేదీల్లో ముగియనుంది. దీంతో వాటికి త్వరలో రెండో సాధారణ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ ప్రక్రియ కీలకంగా మారింది. ఎన్నికలకు సంబంధించిన తదుపరి ప్రక్రియకు ముందుగా ఓటర్ల జాబితాలను సిద్ధం చేసే పనిని ఎస్‌ఈసీ వేగవంతం చేస్తోంది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 11న ఫోటో ఓటర్ల జాబితాల ప్రచురణ జరగనుంది.