
హైదరాబాద్: స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్నాయి. తాతా మధు వ్యాఖ్యలపై భగ్గుమన్న కాంగ్రెస్ నేతలు.. అతడిని ఎమ్మెల్సీగా బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ క్రమంలో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల వివాదంపై ఎమ్మెల్సీ తాతా మధు స్పందించారు.
సోమవారం (సెప్టెంబర్ 7) తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్పీకర్‌ను తాను ఏం అనలేదని వివరణ ఇచ్చారు. స్పీకర్ అంటే తనకు గౌరవం, మర్యాద ఉన్నాయని తెలిపారు. అసెంబ్లీ గేట్ దగ్గర నాపై దాడి చేసి గొంతు నొక్కేందుకు ప్రయత్నించారని.. ఈ దాడితో తాను ఆవేదన చెందానని చెప్పారు. ఆ సమయంలోనూ స్పీకర్‌ను తాను ఏమి అనలేదని స్పష్టం చేశారు. నా వ్యాఖ్యలు స్పీకర్‌ను ఉద్దేశించి అన్నట్లు భావిస్తే ఆ మాటలను ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నానని పేర్కొన్నారు.
వివాదం ఏంటంటే..?
సోమవారం (సెప్టెంబర్ 7) తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ 1000 రోజుల పాలన ఫెయిల్ అని ప్రింట్ చేసి ఉన్న బ్లాక్ టీ షర్ట్లతో ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వచ్చారు. దీంతో అసెంబ్లీ గేట్ దగ్గర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకున్నారు.
బ్లాక్ టీ షర్టులతో లోపలికి అనుమతించలేదు. తమను ఎందుకు ఆపుతున్నారంటూ పోలీసులతో బీఆర్ఎస్ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు తీవ్ర ఆగ్రహానికి గురై ‘ఎవడ్రా స్పీకర్.. ఎవడ్రా మీకు అధికారం ఇచ్చింది’ అంటూ స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించాడని కాంగ్రెస్ ఆరోపించింది.
రాజ్యాంగబద్ధమైన స్పీకర్ పదవికి కనీస మర్యాద ఇవ్వకుండా బీఆర్ఎస్ నేత చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి స్పీకర్ స్థానంలో ఉండటం నచ్చకే బీఆర్‌ఎస్ నేతలు ఇలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వ్యాఖ్యలను శాసన సభలో సీఎం, మంత్రులు, కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీని తక్షణమే డిస్మిస్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు.