
ఒకప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సంచలనం సృష్టించిన ‘మిర్జాపూర్'(Mirzapur) క్రేజ్.. ఇప్పుడు బిగ్ స్క్రీన్‌పై బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. గుర్మీత్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కి ‘మిర్జాపూర్: ది మూవీ’ (Mirzapur: The Movie) సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రోజురోజుకీ ఈ సినిమా కలెక్షన్ల గ్రాఫ్ శరవేగంగా పెరుగుతోంది.
ఈ చిత్రం తొలిరోజే రూ. 25.75 కోట్ల నెట్ వసూళ్లతో గ్రాండ్ ఓపెనింగ్ సాధించగా, రెండో రోజు రూ. 32 కోట్లు కొల్లగొట్టింది. ఇక మూడో రోజు ఏకంగా 12.5 శాతం గ్రోత్‌తో భారతదేశంలో 11,344 షోలలో కలిపి రూ. 36 కోట్ల నెట్ సాధించింది. దీంతో కేవలం మూడు రోజుల్లోనే ఇండియా నెట్ కలెక్షన్స్ రూ. 93.75 కోట్లకు చేరుకున్నాయి. నాలుగో రోజుతోనే ఈ సినిమా ఈజీగా రూ. 100 కోట్ల మైలురాయిని దాటేసింది.
ఇండియా వ్యాప్తంగా దీని గ్రాస్ వసూళ్లు రూ. 112.35 కోట్లుగా ఉండగా.., ఓవర్సీస్‌లో కూడా మూడో రోజు రూ. 7 కోట్లు సాధించి, మొత్తంగా రూ. 20 కోట్ల ఓవర్సీస్ గ్రాస్ సాధించింది. దీంతో వరల్డ్‌వైడ్ గ్రాస్ కలెక్షన్స్ ఏకంగా రూ. 132 కోట్లకు పైగా చేరుకుని సరికొత్త రికార్డు క్రియేట్ చేశాయి. తొలి రోజు నుంచే పాజిటివ్ మౌత్ టాక్ తో దూసుకెళ్తోంది.
మిర్జాపూర్ సింహాసనం కోసం జరిగే రక్తపాతం, పాత పగలు, కొత్త శత్రువుల నడుమ సాగే ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ప్రేక్షకులను సీటు అంచులపై కూర్చోబెడుతోంది. కాళీన్ భయ్యాగా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ పండిట్‌గా అలీ ఫజల్, మున్నా భయ్యాగా దివ్యేందు మరోసారి తమ విశ్వరూపం చూపించారు. రవికిషన్ ఈ కాస్ట్‌లో కొత్తగా చేరగా.. ‘బబ్లూ పండిట్’ పాత్రలో విక్రాంత్ మాస్సే స్థానంలో జితేంద్ర కుమార్ కనిపించడం విశేషం. రసికా దుగల్, శ్వేతా త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ వంటి భారీ తారాగణంతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.