
ఆటో డ్రైవర్లకు ప్రయోజనం చేకూరేలా ఓలా, ఉబర్, ర్యాపిడో తరహాలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ రూపొందించే అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రికి ఇప్పటికే లేఖ రాసినట్లు పొన్నం ప్రభాకర్ తెలిపారు.ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను రూపొందించి అందుబాటులోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
టీజీఎస్‌ఆర్టీసీ ద్వారా ఈవీ ఆటోలను ప్రవేశపెట్టి ‘లాస్ట్ మైల్ కనెక్టివిటీ’ పాలసీ తీసుకురానున్నట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రస్తుతం అలాంటి విధానంపై ఎలాంటి చర్చ జరగడం లేదని తెలిపారు.ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటుపై కార్మిక శాఖతో కలిసి ప్రాధాన్యతా ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ అంశాన్ని కేబినెట్‌లో చర్చించి, అనంతరం శాసనసభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
2012 తర్వాత ఆటో ఛార్జీలు పెంచలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఛార్జీలను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ఛార్జీల పెంపుపై రవాణా శాఖ అధికారులు, ఆటో కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి సమగ్ర ప్రతిపాదనలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఎంత మేర ఛార్జీలు పెంచాలనే అంశంపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తుందని, ఆ నివేదిక ఆధారంగా త్వరలో ఛార్జీల పెంపును అమలు చేస్తామని మంత్రి వెల్లడించారు.