వర్షాకాలంలో కూడా పిల్లలు, పెద్దలు ఐస్‌క్రీమ్‌లు, జ్యూస్‌లు, కూల్‌డ్రింక్స్ ఇష్టంగా తింటుంటారు. అయితే, అతి చల్లటి పదార్థాలు తిన్న వెంటనే ఒక్కసారిగా తల బరువెక్కడం లేదా తీవ్రమైన తలనొప్పి రావడం మీరు గమనించే ఉంటారు. వైద్య పరిభాషలో దీన్ని “కోల్డ్ స్టిమ్యులస్ హెడెక్” లేదా “బ్రెయిన్ ఫ్రీజ్” అని పిలుస్తారు. వర్షాకాలంలో గాలిలో ఇప్పటికే చల్లదనం ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఈ సమయంలో పిల్లలు జాగ్రత్తగా ఉండడం చాలా ముఖ్యం. అసలు ఐస్‌క్రీమ్ తిన్నప్పుడు తల ఎందుకు బరువెక్కుతుందో, దాని నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తనాళాల హఠాత్తు మార్పులు: అతి చల్లని పదార్థాలు నోటి పైభాగం (అంగిలి) లేదా గొంతు వెనుక భాగాన్ని తాకినప్పుడు, అక్కడ ఉండే సూక్ష్మ రక్తనాళాలు ఒక్కసారిగా కుంచించుకుపోతాయి. ఇక ఆ తర్వాత శరీరం ఆ ప్రాంతాన్ని మళ్లీ వేడి చేయడానికి ఆ రక్తనాళాలను అంతలోనే వేగంగా విస్తరింపజేస్తుంది. ఈ హఠాత్తు మార్పుల వల్ల తలలో ఒత్తిడి పెరిగి, తల బరువుగా అనిపిస్తుంది.
నరాల స్పందన – మెదడు భ్రమ: నోటి అంగిలి వద్ద ఉండే ట్రైజెమినల్ నరాలు ఈ ఉష్ణోగ్రత మార్పులను వెంటనే గ్రహించి మెదడుకు సంకేతాలు పంపుతాయి. ఇక ఈ క్రమంలో మెదడు ఆ నొప్పులు నోటిలో కాకుండా తల ముందు భాగంలో లేదా కనుబొమ్మల వెనుక భాగంలో ఉన్నట్లుగా భ్రమిస్తుంది. దీనినే వైద్య పరిభాషలో ‘రెఫర్డ్ పెయిన్’ అంటారు.

వర్షాకాలంలో పిల్లల విషయంలో జాగ్రత్తలు: సాధారణంగా ఈ తలనొప్పి కొన్ని సెకన్ల నుండి ఒకట్రెండు నిమిషాల వరకు మాత్రమే ఉంటుంది, దీనివల్ల పెద్ద ప్రమాదమేమీ లేదు. అయితే వర్షాకాలంలో ఆల్రెడీ వాతావరణం చల్లగా ఉండటం వల్ల పిల్లలు ఐస్‌క్రీమ్‌లు ఎక్కువగా తింటే బ్రెయిన్ ఫ్రీజ్‌తో పాటు జలుబు, గొంతు నొప్పి బారిన పడే అవకాశం ఉంది. అందుకే వారిని ఈ సీజన్లో కాస్త దూరంగా ఉంచడం మేలు.
బ్రెయిన్ ఫ్రీజ్ అయినా వెంటనే నాలుకతో అంగిలిని నొక్కడం: వెంటనే మీ నాలుక కింది భాగాన్ని నోటి పైకప్పుకు (అంగిలికి) గట్టిగా అనిచి ఉంచండి. నాలుక వేడికి అంగిలి త్వరగా సాధారణ ఉష్ణోగ్రతకు వస్తుంది.
సాధారణ నీరు తాగడం: ఇక కొద్దిగా గోరువెచ్చని లేదా సాధారణ నీటిని తాగడం ద్వారా ఉపశమనం పొందవచ్చు.
చేతులతో కప్పడం: ఇక నోరు, ముక్కును చేతులతో మూసి ఉంచి, వేగంగా శ్వాస తీసుకోవడం వల్ల నోటి లోపలి భాగం వెచ్చబడుతుంది.
ఇక చల్లటి పదార్థాలు తిన్నప్పుడు బ్రెయిన్ ఫ్రీజ్ రావడం అనేది శరీరం స్పందించే ఒక సహజ ప్రక్రియ. ముఖ్యంగా వర్షాకాలంలో పిల్లలకు ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్ ఇచ్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తలనొప్పితో పాటు ఇతర ఆరోగ్య సమస్యల నుండి కాపాడుకోవచ్చు.
గమనిక :ఈ తలనొప్పి సహజంగానే 1-2 నిమిషాల్లో తగ్గిపోతుంది. ఒకవేళ చల్లటి పదార్థాలు తినకపోయినా లేదా ఈ నొప్పి చాలా సేపటి వరకు తగ్గకుండా వేధిస్తుంటే మాత్రం వైద్యుడిని సంప్రదించడం మంచిది.
The post చల్లటి పదార్థాలు తింటే తల బరువెక్కుతోందా..? ఐస్‌క్రీమ్, జ్యూస్ విషయంలో ఈ విషయం తెలుసుకోండి! appeared first on Manalokam – Latest Telugu News & Updates.