
ఇటీవల ‘మండాడి’ చిత్రంతో ఆడియన్స్ ముందుకొచ్చిన సుహాస్.. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న మరో చిత్రంలో నటిస్తున్నాడు. ‘హైడ్ అండ్ సిల్క్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్‌కు చెందిన స్టోన్ బెంచ్ స్టూడియోస్ నిర్మిస్తోంది. రాజేంద్ర బాల దర్శకుడు. ‘డీసీ’ ఫేమ్ సంజన కృష్ణమూర్తి హీరోయిన్.
సోమవారం టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఇందులో సుహాస్ చీర నేస్తూ కనిపిస్తాడు. ఆయనకు తోడుగా సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఇంటెన్స్ వాయిస్ వినిపించింది. ప్రతి చీర ఓ అమ్మాయిని ఎంచుకుంటుంది, దాని అందం కేవలం నేతపనిలోనే ఉండదని చెప్పే తనికెళ్ల భరణి వాయిస్ ఓవర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
“రేయ్ కొత్తగా నేయి.. మిషిన్లు వాడు.. కానీ, మగ్గం మీద కూడా ఓ చీర నేయిరా.. చీర నేయడం అనేది ఒక పని కాదురా.. అది ఒక కళ. ప్రతి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్టు.. ప్రతి చీర మీద ఒక అమ్మాయి పేరు రాసి ఉంటుంది. చీరకు అందం నువ్వు నేసినప్పుడు కాదు.. దాన్ని నేసేటప్పుడు.. అది ఒక అమ్మాయిని ఎంచుకుంటుంది. ఆ అమ్మాయి కట్టుకున్నప్పుడే ఆ చీరకి అసలైన అందం’’ అని చెబుతూ కథలోని భావోద్వేగాలను, ప్రేమలోని సున్నితమైన అనుభూతులను ఆయన వాయిస్ మరింత అందంగా ఎలివేట్ చేస్తోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సుహాస్ మాట్లాడుతూ ‘మంచి టీమ్‌తో చేసిన సినిమా ఇది. ఇందులో ఏ ఒక్కరు లేకపోయినా సినిమా పూర్తయ్యేది కాదు’ అని చెప్పాడు. ఇది చాలా ఇంటరెస్టింగ్ స్టోరీ అని, ఇందులో ఎమోషన్స్, కామెడీ అన్నీ బాగుంటాయని నిర్మాత కార్తీక్ సుబ్బరాజు చెప్పాడు. ఇదొక పొయెటిక్ లవ్‌స్టోరీ అని తనికెళ్ల భరణి అన్నారు.
ఈ చిత్రంతో తెలుగు ఆడియన్స్ ముందుకు రావడం ఆనందంగా ఉందని దర్శకుడు రాజేంద్ర బాల చెప్పాడు. నటుడు నందు, నిర్మాతలు వర్తికా జైన్, కార్తికేయన్ సంతానం, లిరిక్ రైటర్ కృష్ణకాంత్, మ్యూజిక్ డైరెక్టర్ అమృత్, డీఓపీ కార్తిక్ పళని, ఆర్ట్ డైరెక్టర్ సురేష్ సెల్వరాజన్ తదితరులు పాల్గొన్నారు.