
ఉత్తర లండన్‌లోని బార్నెట్ ప్రాంతంలో ఓ కుటుంబం నివసిస్తోంది. ఆ ఇంట్లోని లివింగ్ రూమ్‌లో ఉన్న సోఫా కింద పెద్ద పింగాణీ పళ్లెం ఎన్నో ఏళ్లుగా ఉంది. దానిపై దుమ్ము, మట్టి పేరుకుపోయినా కుటుంబ సభ్యులు దాని అసలు విలువను గుర్తించలేకపోయారు. చైనా నుంచి బ్రిటన్‌కు వలస వచ్చిన వింగ్ లంగ్ గూ అనే వ్యక్తి 20వ శతాబ్దం ప్రారంభంలో ఆ పళ్లాన్ని బ్రిటన్‌కు తెచ్చారు. అప్పటి నుంచి అది కుటుంబ వారసత్వంగా తరతరాలుగా కొనసాగుతోంది. ఇటీవల ఆ కుటుంబానికి చెందిన ఓ బంధువు ఆ పళ్లెం ఫొటోలను ప్రముఖ వేలం సంస్థ వూలీ అండ్ వాలిస్‌కు పంపించారు. దాని అసలు విలువ తెలుసుకోవాలనే ఉద్దేశంతో నిపుణులను సంప్రదించారు. ఫొటోల్లోనే దాని ప్రత్యేకతను గుర్తించిన ఆసియా కళాఖండాల నిపుణుడు జాన్ ఆక్స్‌ఫర్డ్ స్వయంగా పరిశీలించగా అడుగు భాగంలో నాలుగు అక్షరాలతో కూడిన చైనా ముద్ర కనిపించింది.
చైనా చక్రవర్తుల రాజప్రాసాదంతో సంబంధం!
పళ్లెం అడుగున ఉన్న ‘Chuxiugong zhi’ అనే నాలుగు అక్షరాల ముద్రను బట్టి.. అది బీజింగ్‌లోని forbidden city లోని చుక్సియు ప్యాలెస్ కోసం తయారు చేసిన వస్తువుగా నిపుణులు గుర్తించారు. ఈ రాజప్రాసాదానికి చైనా చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా మహారాణి సిక్సీతో దీనికి సన్నిహిత సంబంధం ఉంది. ఆమె 1856 నుంచి 1885 మధ్య కాలంలో ఈ రాజప్రాసాదాన్ని తన ప్రధాన నివాసంగా ఉపయోగించారు. 1884లో తన 50వ పుట్టినరోజు సందర్భంగా సిక్సీ రాజప్రాసాదానికి మరమ్మతులు, అలంకరణలు చేయించినట్లు చారిత్రక వివరాలు సూచిస్తున్నాయి. ఆ సమయంలో పెద్ద పరిమాణంలో ఉన్న అలంకరణ వస్తువులను కూడా ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఆధారాలను పరిశీలించిన జాన్ ఆక్స్‌ఫర్డ్.. ఈ పళ్లెం 1880లలో సిక్సీ పుట్టిన రోజును పురస్కరించుకుని తయారు చేసి ఉండవచ్చని అంచనా వేశారు. అంటే, ఇది చైనాలో క్వింగ్ రాజవంశ పాలన కాలానికి చెందినది. ఈ పళ్లెం పరిమాణం కూడా దీని ప్రత్యేకతను సూచిస్తోంది. 61 సెంటీమీటర్ల వెడల్పు, దాదాపు 13.6 కిలోల బరువు ఉంది. పళ్లెంపై పసుపు రంగు ప్రధానంగా కనిపిస్తుంది. దానిపై ఆకుపచ్చ, వంకాయ రంగు ఎనామెల్‌తో అలంకరణలు చేశారు. మధ్యలో రెండు డ్రాగన్లు మండుతున్న ముత్యం కోసం పోటీపడుతున్నట్లుగా చిత్రించారు.
గతంలోనూ ఇలాంటి పళ్లెం వేలం
ఇదే తరహా చైనా పింగాణీ వస్తువులు గతంలోనూ వేలంలో మంచి ధర పలికాయి. 2023లో వూలీ అండ్ వాలిస్ సంస్థ వేలం వేసిన మరో పళ్లెం 8,820 పౌండ్లకు అమ్ముడైంది. 2016లో సోథెబీస్ సంస్థ కూడా ఇదే తరహా ముద్ర ఉన్న పెద్ద పసుపు రంగు పళ్లానికి 60,000 నుంచి 80,000 డాలర్ల అంచనా ధరను ప్రకటించింది. అయితే ప్రస్తుతం వేలానికి రానున్న పళ్లెం వాటికంటే చాలా పెద్దది. దాని అడుగు భాగంలో ఉన్న ప్రత్యేకమైన పసుపు రంగు గ్లేజ్, మహారాణి సిక్సీ రాజప్రాసాదంతో ఉన్న సంబంధం దీనికి అదనపు ప్రాధాన్యం తెచ్చాయని నిపుణులు భావిస్తున్నారు.
నవంబర్ 10న వేలం.. ఎంత ధర పలుకుతుంది?
వూలీ అండ్ వాలిస్ వేలం సంస్థ ఈ అరుదైన పళ్లెాన్ని 2026 నవంబర్ 10న వేలానికి ఉంచనుంది. దీనికి 20,000 నుంచి 30,000 పౌండ్ల వరకు ధర వస్తుందని అంచనా వేసింది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.24 లక్షల నుంచి రూ.36 లక్షల వరకు ఉంటుంది. అయితే తుది ధర వేలంలో కొనుగోలుదారులు ఇచ్చే బిడ్లపై ఆధారపడి ఉంటుంది. దశాబ్దాలుగా ఓ ఇంట్లో సోఫా కింద నిర్లక్ష్యంగా పడి ఉన్న వస్తువు.. ఒక్క నిపుణుడి పరిశీలనతో చైనా రాజవంశ చరిత్రకు సంబంధించిన అరుదైన కళాఖండంగా గుర్తింపు పొందింది. దాని అడుగు భాగంలో ఉన్న చిన్న ముద్రే ఈ పళ్లెం వెనుక దాగి ఉన్న చరిత్రను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కళాఖండాల సేకరణకర్తల దృష్టి ఈ వేలంపై పడే అవకాశం ఉంది.