Reading Time: 2 minutes

Vidya Balan: ‘ది డర్టీ పిక్చర్’ సీక్వెల్ రెడీ.. విద్యాబాలన్ ప్లేస్‌లో ఎవరంటే?

Caption of Image.

ఒకప్పుడు బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన ‘ది డర్టీ పిక్చర్’ కు ఇప్పడు సీక్వెల్ సిద్ధమవుతోంది. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ బోల్డ్ బయోపిక్‌ విడుదలై సరిగ్గా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. దక్షిణాది సినీ రంగాన్ని తన గ్లామర్‌తో ఏలిన దివంగత నటి సిల్క్ స్మిత జీవిత ఆధారంగా రూపొందించారు.ఈ సినిమాలో విద్యాబాలన్ ప్రదర్శించిన బోల్డ్ నటన ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. జాతీయ ఉత్తమ నటిగా విద్యాబాలన్ అవార్డు సొంతం చేసుకోవడమే కాకుండా, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

‘ది డర్టీ పిక్చర్ సీక్వెల్..
బాక్సాఫీస్ దగ్గర విమర్శకుల ప్రశంసలు.. అవార్డుల వేటలోనూ తిరుగులేని విజయం సొంతం చేసుకున్న ఈ చిత్రం సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నిర్మాత ఏక్తా కపూర్.. తాను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న భారీ ప్రాజెక్టుల్లో ‘ది డర్టీ పిక్చర్ 2’ కూడా ఉందని వెల్లడించారు. 15 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ కథా ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానని, ఈసారి ప్రేక్షకులకు చెప్పాల్సిన ఓ బలమైన కథ దొరికిందని ఆమె పేర్కొన్నారు. సమాజం విధించే హద్దులు, మహిళలపై తీర్పులు, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాల చుట్టూ ఈ సినిమా సాగనుందని ఆమె మాటలను బట్టి తెలుస్తోంది.

కథపై సస్పెన్స్..
మొదటి భాగం ‘ ది డర్టీ పిక్చర్ ‘లో దివంగత దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవితంలోని కొన్ని అంశాల స్ఫూర్తితో కథను తెరకెక్కించారు. ఆమెను కేవలం బాధితురాలిగా కాకుండా, తన ఇష్టాయిష్టాలను స్వేచ్ఛగా వ్యక్తపరిచిన మహిళగా చూపించడమే ఆ సినిమా ప్రత్యేకత. సీక్వెల్‌లోనూ అలాంటి బలమైన మహిళ ప్రయాణమే ప్రధాన ఆకర్షణ కానుంది. అయితే ఈసారి ఎవరి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారన్నది ఇంకా వెల్లడించలేదు.

విద్యాబాలన్ మళ్లీ వస్తారా?
2011 డిసెంబర్ 2న విడుదలైన ‘ది డర్టీ పిక్చర్’లో విద్యాబాలన్‌తో పాటు నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హాష్మీ, తుషార్ కపూర్ కీలక పాత్రల్లో నటించారు. మిలన్ లూథ్రియా దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయాన్ని సొంతం చేసుకుంది అంతేకాదు ఈ మూవీ నటనకు విద్యాబాలన్‌కు ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని తెచ్చిపెట్టింది.

అయితే ఈ సీక్వెల్‌లో విద్యాబాలన్ నటిస్తారా? లేక మరో నటి కథానాయికగా కనిపిస్తారా? దర్శకుడు ఎవరు? విడుదల తేదీ ఎప్పుడు? ఈ వివరాలపై ఇంకా స్పష్టత లేదు. త్వరలోనే మరిన్ని వివరాలను ప్రకటించే అవకాశం ఉందని ఏక్తా సంకేతాలిచ్చారు. దీంతో ‘ది డర్టీ పిక్చర్ 2’పై బాలీవుడ్‌లో ఆసక్తి మొదలైంది. ఈసారి వెండితెరపై ఎలాంటి కథ సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

©️ VIL Media Pvt Ltd.