తాటిచెట్టు ఎక్కడం, కల్లు గీయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు..! మోకు సాయంతో చెట్టుపైకి ఎక్కి..గంటల తరబడి శ్రమిస్తూ..ప్రాణాలను సైతం పణంగా పెట్టి కల్లుగీసే గీత కార్మికులను చూస్తుంటాం. కానీ ఓ రైతు తన వినూత్న ఆలోచనతో కల్లుగీత కార్మికుల కష్టానికి సరికొత్త పరిష్కారం చూపించాడు.తాటిచెట్టుకు ఐరన్ కడ్డీలతో ఏకంగా నిచ్చెననే ఏర్పాటు చేశాడు.. ఇంటి మెట్లు ఎక్కినట్లే తాటి చెట్టుపైకి అలవోకగా ఎక్కుతూ.. కేవలం ఐదు నిమిషాల్లోనే కల్లుగీసే మార్గం చూపాడు.. వినడానికి విచిత్రంగా ఉన్నా.. చూడడానికి మాత్రం అద్భుతం.
జనగామ జిల్లా పాలకుర్తి మండలం ఈరవెన్ను గ్రామానికి చెందిన మహేందర్ అనే రైతుకు మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది..ఇతను పొలం చుట్టూ పదికి పైగానే తాటి చెట్లు ఉన్నాయి..కానీ తన తాడిచెట్లు ఎక్కనికి ఏ ఒక్క గీతాకార్మికుడు సమయం కేటాయించడం లేదు.. ఎవరూ ధైర్యంచేసి ముందుకు రాకపోవడంతో తానే ధైర్యం చేసి ఓ వినూత్న ఆలోచన చేశాడు.
తన స్నేహితుడు అయిన ఓ వెల్డింగ్ షాప్ వ్యక్తితో మహేందర్ తన పొలంలోని తాటిచెట్లకు ఐరన్ కడ్డీలతో మెట్లును తయారుచేపించి చెట్లకు ఏర్పాటు చేయించాడు..ఒక్కో చెట్టుకు రూ.10 వేల చొప్పున.. ఓ మూడు చెట్లకు రూ.30 వేలు ఖర్చు చేశాడు. ఈ మెట్ల సాయంతో ఎలాంటి మోకు ముస్తాదు సహాయం లేకుండా ఇంటి మెట్ల పైకి ఎక్కినట్టే కేవలం ఐదు నిమిషాల్లోనే చెట్లపైకి చేరుకుని కల్లు గీస్తు అందర్నీ ఆకట్టుకుంటూ అబ్బురపరుస్తున్నాడు.
గత మూడేళ్లుగా మహేందర్ ఇదే విధానాన్ని అనుసరిస్తూ సుమారు నెలకు సుమారు రూ.60 వేల వరకు సంపాదించినట్లు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు.. ఈ రైతు ఆవిష్కరణ కళ్లగీత కార్మికులను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. గీత కార్మికులు ప్రమాదాల నివారణకు ఇలాంటి మార్గం అనుసరిస్తే బాగుంటుందని అంటున్నారు.



