
- సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి
- మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి
సైఫాబాద్, వెలుగు: పేర్లలో స్పెల్లింగ్ మిస్టేక్స్ కారణంతో ఓటర్లను జాబితా నుంచి తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శించారు. సర్ ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పీపుల్స్ ఫ్రంట్ ఆధ్వర్యంలో హైదరాబాద్ బీఆర్‌కే భవన్‌లోని ఎన్నికల కమిషనర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొని మాట్లాడారు.
విదేశీయులు, మరణించిన వారి ఓట్లను తొలగించడంపై అభ్యంతరం లేదని, పేర్లలో స్పెల్లింగ్ తప్పులున్నాయనే సాకుతో ఓటు హక్కును తొలగించడం సరికాదన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో లక్షా 40 వేల ఓట్లను తొలగించడంతోపాటు మరో 92 వేల మంది ఓటర్లకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లను తొలగించారని ఆరోపించారు. ఓట్లు కోల్పోయిన వారు మళ్లీ ఫారం-6 ద్వారా నమోదు చేసుకోవాలని చెప్పడం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడమే అన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించిన 2023 చట్టాన్ని రద్దు చేయాలని కోరారు.