
- లాభాల్లో 34 శాతం వాటా.. రూ.596 కోట్లు పంపిణీ
- 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులకు లబ్ధి
- 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 చొప్పున చెల్లింపు
- ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్/కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికులకు దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. సంస్థకు ఈ ఏడాది రూ.1,754 కోట్ల లాభాలు రాగా, గతేడాది మాదిరిగానే అందులో 34 శాతాన్ని కార్మికులకు లాభాల వాటాగా అందించనున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. మంగళవారం ప్రజాభవన్లో మంత్రి శ్రీధర్బాబుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి ఆర్జించిన నికర లాభాల్లో రూ.596 కోట్లను లాభాల వాటాగా కార్మికులకు పంపిణీ చేయనున్నట్లు భట్టి తెలిపారు.
సంస్థలో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున రూ.1,53,912 చొప్పున అందనుంది. మొత్తం 38,737 మంది పర్మినెంట్ ఉద్యోగులు ఈ నిర్ణయంతో ప్రయోజనం పొందనున్నారు. కాంట్రాక్టు కార్మికులకు కూడా దసరా బోనస్ అందించనున్నట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 29,717 మంది కాంట్రాక్టు కార్మికులకు ఒక్కొక్కరికి రూ.5,500 చొప్పున చెల్లించనున్నట్లు తెలిపారు. పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్టు కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని భట్టి స్పష్టం చేశారు. సింగరేణిలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి శ్రీధర్బాబు తెలిపారు.
డిస్మిస్డ్ ఉద్యోగుల సమస్యలతో పాటు కార్మికులకు సంబంధించిన పలు సంక్షేమ అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. సమావేశంలో కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలు కోరం కనకయ్య, మట్టా రాగమయి, పాయం వెంకటేశ్వర్లు, మాలోతు రాందాస్ నాయక్, గండ్ర సత్యనారాయణ రావు, విజయరామారావు, ఇంధన శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.