
ఎయిర్ ఇండియా విమానానికి మరోసారి హైజాక్ హెచ్చరికలు రావడం తీవ్ర కలకలం రేపింది. ఫ్రాంక్ఫర్ట్ నుండి ఢిల్లీకి బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానానికి హైజాక్ హెచ్చరికలు రావడంతో రాజస్థాన్లోని జైపూర్ విమానాశ్రయంలో అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు.
వివరాల్లోకి వెళ్తే.. 306 మంది ప్రయాణీకులతో ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ-2030 విమానం ఉదయం జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి బయలుదేరింది. అయితే ఫ్లైట్ గాల్లో ఉండగానే అహ్మదాబాద్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్కు స్క్వాక్ 7500 కోడ్ వచ్చింది. అయితే సాధారణంగా విమానం హైజాక్కు గురైనప్పుడు లేదా తీవ్ర ముప్పు ఏదైనా ఉన్నప్పుడు ఈ సిగ్నల్ వెళ్తుంది. హైజాక్ హెచ్చరికలు అందిన వెంటనే భద్రతాదళాలు, విమానయాన అధికారులు అప్రమత్తమయ్యారు.
ముందుజాగ్రత్త చర్యగా విమానాన్ని ఢిల్లీకి బదులుగా జైపూర్ విమానాశ్రయానికి మళ్లించి, అక్కడ సురక్షితంగా ల్యాండ్ చేశారు. తర్వాత విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బేకి తరలించారు. ప్రయాణికుల నందరినీ కిందకు దించారు. ప్రస్తుతం విమానాన్ని ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అలాగే మరో ప్రత్యేక విమానం ద్వారా ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.