Reading Time: < 1 minute
Ap Local Body Elections 2026 Schedule Notification And Poll Dates

AP Local Body Elections 2026: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) సిద్ధమైంది. బుధవారం ఉదయం 11:30 గంటలకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఎస్‌ఈసీ కమిషనర్ అనిల్‌ చంద్ర పునేఠా స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేయనున్నారు. అదే సమయంలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను కూడా జారీ చేయనున్నారు. మంగళవారం ఎస్‌ఈసీ కమిషనర్ లోక్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు బుధవారం షెడ్యూల్‌ జారీ చేస్తున్నట్లు చెప్పిన విషయం తెలిసిందే.

మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల కోసం ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ నెల 21లోపు నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. అనంతరం ఈ నెల 28న పోలింగ్ నిర్వహించి, 30న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశమున్నట్లు సమాచారం. మరోవైపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల కోసం ఈ నెల 21 నుంచి 23 వరకు నామినేషన్లు స్వీకరణ, 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం. నవంబర్ 3న పోలింగ్, నవంబర్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశముందని తెలుస్తోంది.

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందన్న సమాచారంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన రాజకీయ పార్టీల్లో ఆసక్తి నెలకొంది. కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీ.. వైసీపీ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అన్ని పార్టీల్లోని ఆశావహులు, స్థానిక నాయకులు సన్నద్ధమవుతున్నారు. అయితే నామినేషన్లు, పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలపై పూర్తి స్పష్టత రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన వెలువడిన తర్వాతే రానుంది.