
- అడ్డుకున్న పోలీసులు, ఇరువర్గాల మధ్య తోపులాట
హుస్నాబాద్, వెలుగు : కరెంట్ కోతలను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో రోడ్డుపై బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఓ నాయకుడు ముందుగానే ప్రభుత్వ దిష్టిబొమ్మకు నిప్పంటించి, దానిని నిరసన ప్రదేశానికి తీసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా.. బీజేపీ నాయకులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో మంటలు అంటుకోవడంతో ఓ బీజేపీ కార్యకర్త స్వల్పంగా గాయపడ్డారు. పోలీసులు పలువురు బీజేపీ లీడర్లను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయానికి సరిపడా కరెంట్ అందక పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, ప్రభుత్వం స్పందించి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ నాయకుల ఆందోళనతో వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. అంతకుముందు రేగొండ, బంజరుపల్లి స్టేజీల వద్ద సైతం రైతులు రాస్తారోకో చేపట్టగా.. అక్కన్నపేట ఎస్సై ప్రశాంత్ చేరుకుని రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు.