Reading Time: 2 minutes
చదివింది పదో తరగతే.. డీఎస్పీ అవతారమెత్తి రూ.26 లక్షలు వసూలు! చివరకు ఎలా చిక్కాడంటే..!

ఏలూరు: చదివింది కేవలం పదో తరగతే.. కానీ, చేసే బిల్డప్ మాత్రం డీఎస్పీ స్థాయి! ఖాకీ ముసుగు వేసుకుని అమాయక నిరుద్యోగులు, మహిళలను బురిడీ కొట్టిస్తున్న ఓ ఘరానా మోసగాడి ఆట కట్టించారు ఏలూరు పోలీసులు. గుంటూరు జిల్లాలో డీఎస్పీగా పనిచేస్తున్నానంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి ఏకంగా రూ.26 లక్షలు వసూలు చేసిన కేటుగాడిని కటకటాల్లోకి నెట్టారు.

లగ్జరీ హోటళ్లలో మీటింగులు.. ఖాకీ డ్రెస్‌తో నమ్మకం!

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలానికి చెందిన బత్తుల శ్రీనివాస్ అలియాస్ శ్రీను(35) చదువుకుంది పదో తరగతి వరకు మాత్రమే. అయితే, అమాయకుల ఆశలను ఆసరాగా చేసుకుని సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తాను గుంటూరు జిల్లాలో డీఎస్పీగా విధులు నిర్వహిస్తున్నానని, అంతేకాకుండా గోల్డ్ బిజినెస్ కూడా ఉందంటూ ప్రచారం చేసుకునేవాడు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలు, ఉద్యోగాన్వేషణలో ఉన్న నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని.. వారిని ఖరీదైన లగ్జరీ హోటళ్లకు పిలిపించి నమ్మకం కుదిరేలా మాట్లాడేవాడు.

రూ.26 లక్షలు కొల్లగొట్టిన కేటుగాడు

ఇటీవల ఏలూరుకు చెందిన పాలిక రంగ వీరబాబుకు ఎస్సై ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.18 లక్షలు, మరో బాధితుడు దండిపాటి గణేష్ నుంచి రూ.8 లక్షలు వసూలు చేశాడు. ఇలా మొత్తం రూ.26 లక్షలు కాజేసిన తర్వాత.. మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

పోలీసుల ఆపరేషన్.. లాడ్జిలో పట్టుబడ్డ నిందితుడు

బాధితుల ఫిర్యాదుపై ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, ఐపీఎస్ తక్షణమే స్పందించారు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఏలూరు II టౌన్ సీఐ కె. అశోక్ కుమార్, ఎస్సై బి. మధు వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ కె. రవిచంద్‌లతో కూడిన ప్రత్యేక బృందం రంగంలోకి దిగింది. నిఘా పెట్టిన పోలీసులు.. ఏలూరు II టౌన్ పరిధిలోని జికె ప్యాలెస్ లాడ్జిలో బస చేసిన నకిలీ డీఎస్పీ బత్తుల శ్రీనివాస్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి రూ.5,50,000/- నగదు, నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు, పోలీస్ డిపార్ట్‌మెంట్ రబ్బర్ స్టాంపులు, పోలీస్ యూనిఫాం, వాకీటాకీ స్వాధీనం చేసుకున్నారు.

గతంలోనూ పలు జిల్లాల్లో కేసులు

ఈ నిందితుడిపై గతంలోనూ రాజమండ్రి II టౌన్, మఠంపల్లి, సూర్యాపేట, నరసరావుపేట రూరల్, త్రిపురాంతకం, చిలకలూరిపేట పోలీస్ స్టేషన్లలో పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. కేసును వేగంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్న ఎస్సై బి. మధు వెంకటరాజు, హెడ్ కానిస్టేబుల్ కె. రవిచంద్‌లను జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.