
న్యూఢిల్లీ, వెలుగు: ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మంగళవారం ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కూడా హాజరయ్యారు. రాజాజీ మార్గ్ 10లోని ఖర్గే నివాసంలో దాదాపు అరగంటకు పైగా సాగిన ఈ భేటీలో సర్ ప్రక్రియతో ఓట్ల చోరీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ పై దేశవ్యాప్తంగా ఉద్యమాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలనే అంశాలపై చర్చించారు.
దసరా తర్వాత హైదరాబాద్ వేదికగా నిర్వహించే ఇండియా కూటమి నేతల ఆందోళనపై డిస్కర్స్ చేశారు. మరోవైపు ఢిల్లీలో ఖర్గే నేతృత్వంలో వారం రోజులపాటు నిర్వహించిన ఆందోళనలు విజయవంతమయ్యాయంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, సీనియర్ నేత రవిలను మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే వినోద్, ఎంపీ వంశీకృష్ణ మీట్అయ్యారు. కాగా.. సాయంత్రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తోపాటు పలువురు ఎమ్మెల్యేలు, డీసీసీల అధ్యక్షులు ఖర్గేను కలిశారు.