Reading Time: 3 minutes
Iphone 17 Pro Vs Iphone 18 Pro Key Upgrades Camera Battery And Price Compared

iPhone 17 Pro vs iPhone 18 Pro: యాపిల్ ప్రో సిరీస్‌లో iPhone 18 Pro.. గతేడాది వచ్చిన iPhone 17 Proతో పోలిస్తే పలు కీలకమైన అప్‌గ్రేడ్స్‌తో వస్తోంది. ముఖ్యంగా కెమెరా, ప్రాసెసర్, బ్యాటరీ, కూలింగ్ సిస్టమ్, కనెక్టివిటీ, స్టోరేజ్ వంటి విభాగాల్లో కొత్త మార్పులు కనిపిస్తున్నాయి. అయితే డిజైన్, డిస్‌ప్లే విషయంలో మాత్రం పెద్దగా మార్పులు లేవు. మరి iPhone 18 Proలో కొత్తగా ఏం ఉంది? iPhone 17 Proతో పోలిస్తే ఎంత అప్‌గ్రేడ్ అయింది? ఇప్పుడు చూద్దాం.

కెమెరాలో అతిపెద్ద అప్‌గ్రేడ్..

iPhone 18 Proలో కెమెరా విభాగంలో యాపిల్ కీలకమైన మార్పు చేసింది. ఇందులో 48MP Fusion మెయిన్ కెమెరాకు మెక్కానికల్ వేరియబుల్ అపెర్చర్‌ను తీసుకొచ్చింది. ఇది f/1.48 నుంచి f/4 వరకు అపెర్చర్‌ను మార్చుకునే అవకాశం కల్పిస్తుంది. 6 లేజర్-కట్ బ్లేడ్‌లతో రూపొందించిన ఈ ఫిజికల్ అపెర్చర్ సిస్టమ్.. ఐఫోన్‌లో తొలిసారిగా అందుబాటులోకి వచ్చింది. యూజర్లు ఆటోమేటిక్‌గా మాత్రమే కాకుండా మాన్యువల్‌గా కూడా అపెర్చర్, షట్టర్ స్పీడ్, వైట్ బ్యాలెన్స్, హిస్టోగ్రామ్ వంటి సెట్టింగ్స్‌ను కంట్రోల్ చేసుకోవచ్చు.

f/1.48 అపెర్చర్ కారణంగా iPhone 17 Proలోని f/1.78తో పోలిస్తే దాదాపు 45% ఎక్కువ కాంతిని సెన్సార్ క్యాప్చర్ చేయగలదు. దీంతో ముఖ్యంగా తక్కువ వెలుతురు పరిస్థితుల్లో ఫొటోలు మరింత మెరుగ్గా వచ్చే అవకాశం ఉంది. అలాగే స్మార్ట్ ఫోకస్, వేగవంతమైన నైట్ మోడ్, 60fps వరకు సినిమాటిక్ వీడియో, 4K డాల్బీ విజన్ HDR టైమ్‌ల్యాప్స్, ఆపిల్ రిఫరెన్స్ ఇమేజ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. అయితే అల్ట్రావైడ్, ఫ్రంట్ కెమెరాల్లో పెద్దగా మార్పులు లేవు. టెలిఫోటో కెమెరా 4x, 8x ఆప్టికల్-క్వాలిటీ జూమ్‌కు సపోర్ట్ చేస్తుంది.

కొత్త A20 Pro చిప్..

ఐఫోన్ 18 ప్రో లో A20 Pro చిప్‌ను ఉపయోగించారు. ఇది 2nm ప్రాసెస్‌పై తయారవుతుండగా, ఐఫోన్ 17 ప్రో లోని A19 Pro 3nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది. రెండు ఫోన్లలో 12GB RAM, 6-కోర్ CPU ఉన్నప్పటికీ.. A20 Proలో 7-కోర్ GPU ఉండటంతో గ్రాఫిక్స్ పనితీరు మరింత మెరుగుపడుతుంది. కొత్త చిప్‌లో GPU పనితీరు 40% వరకు వేగంగా, మెమరీ బ్యాండ్‌విడ్త్ దాదాపు 50% ఎక్కువగా ఉండొచ్చు. రెండు 16-కోర్ న్యూరల్ ఇంజిన్స్ ఉండటంతో ఆన్-డివైస్ AI పనితీరులో కూడా ఐఫోన్ 18 ప్రో కు ప్రయోజనం ఉంటుంది.

కూలింగ్ సిస్టమ్‌లోనూ..

ఎక్కువసేపు గేమింగ్ లేదా హెవీ టాస్కింగ్ చేసినప్పుడు ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ఐఫోన్ 18 ప్రోలో కొత్త కూలింగ్ సిస్టమ్‌ను అందించారు. ఇది నేరుగా చిప్‌కు అనుసంధానమై ఉండటంతో పాటు గత మోడల్‌తో పోలిస్తే సుమారు మూడు రెట్లు ఎక్కువ సర్ఫేస్ ఏరియాను కలిగి ఉంటుంది. దీంతో సస్టెయిన్డ్ పనితీరు 40% వరకు మెరుగుపడే అవకాశం ఉంది.

బ్యాటరీ..

బ్యాటరీ విషయంలోనూ ఐఫోన్ 18 ప్రో ముందంజలో ఉంది. iPhone 17 Pro గరిష్ఠంగా 33 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తే.. eSIM-only iPhone 18 Pro మోడల్ 36 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌ను అందిస్తుంది. చార్జింగ్ విషయంలో కూడా అప్‌గ్రేడ్ ఉంది. 40W అడాప్టర్‌తో ఐఫోన్ 18 Proను సుమారు 15 నిమిషాల్లో 50 శాతం వరకు చార్జ్ చేయవచ్చు. iPhone 17 Proకు ఇదే స్థాయికి చేరుకోవడానికి దాదాపు 20 నిమిషాలు పడుతుంది.

కొత్త కనెక్టివిటీ ఫీచర్లు..

iPhone 18 Proలో కొత్త C2 మోడెమ్ ఉంది. ఇది C1Xతో పోలిస్తే సుమారు 15% తక్కువ విద్యుత్‌ను వినియోగిస్తుంది. అమెరికా మోడళ్లలో mmWave 5Gకు కూడా సపోర్ట్ ఉంటుంది. అలాగే కొత్త N1 చిప్ ద్వారా Wi-Fi 7, బ్ల్యూఎటూత్ 6, థ్రెడ్ కనెక్టివిటీకి సపోర్ట్ లభిస్తుంది.

డిజైన్‌లో స్వల్ప మార్పులు..

డిజైన్ విషయంలో iPhone 18 Pro, iPhone 17 Proకు చాలా దగ్గరగానే ఉంటుంది. ఇందులో 6.3-అంగుళాల OLED 120Hz ProMotion డిస్‌ప్లే, 3000 nits వరకు పీక్ బ్రైట్నెస్, అల్యూమినియం యూనిబాడీ డిజైన్ ఉన్నాయి. బరువు మాత్రం స్వల్పంగా పెరిగింది. iPhone 17 Pro 206 గ్రాములు ఉండగా.. iPhone 18 Pro 211 గ్రాములు ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ పరిమాణాన్ని తగ్గించడంతో పాటు ఒకేసారి మూడు Live Activities వరకు చూపించేలా మార్పులు చేశారు. పేస్ ఐడి కెమెరాను డిస్‌ప్లే కిందకు మార్చడంతో పాటు పైభాగంలోని ఇతర అంశాల స్థానంలో కూడా మార్పులు చేశారు.

కొత్త కలర్ ఆప్షన్స్..

ఐఫోన్ 18 ప్రో లో బ్లాక్, సిల్వర్, గ్లేసియర్, బుర్గున్డి కలర్ ఆప్షన్స్ అందుబాటులో ఉంటాయి. iPhone 17 Proలో కనిపించిన కాస్మిక్ ఆరంజ్ రంగు కొత్త మోడల్‌లో ఉండదు. బ్లాక్ కలర్ మాత్రం తిరిగి వచ్చింది. స్టోరేజ్ విషయంలోనూ iPhone 18 ప్రో ప్రత్యేకతను సంతరించుకుంది. ఇందులో తొలిసారిగా 2TB స్టోరేజ్ వేరియంట్ అందుబాటులోకి వచ్చింది. ఎక్కువగా వీడియోలు షూట్ చేసే యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు, ప్రొఫెషనల్ యూజర్లకు ఇది ఉపయోగపడుతుంది.

సాఫ్ట్‌వేర్‌లోనూ కొత్త అనుభవం

ఐఫోన్ 18 ప్రో లో iOS 27తో పాటు కొత్త సిరి AI ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. అయితే iOS 27 పాత ఐఫోన్ మోడళ్లకు కూడా అందుబాటులోకి రావడంతో కేవలం సాఫ్ట్‌వేర్ కారణంగా iPhone 17 Pro నుంచి 18 Proకి అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చు. అయితే A20 Pro చిప్ కారణంగా ఆన్-డివైస్ AI పనితీరులో iPhone 18 Proకు స్పష్టమైన ప్రయోజనం ఉండే అవకాశం ఉంది.

ధరలోనే మొదలైన తేడా..

ఐఫోన్ 18 ప్రో అమెరికా మార్కెట్లో $1,199 ప్రారంభ ధరతో వస్తుంది. గతేడాది వచ్చిన iPhone 17 Pro ప్రారంభ ధర $1,099గా ఉంది. అంటే కొత్త మోడల్ ప్రారంభ ధర $100 ఎక్కువ. భారత మార్కెట్ ధరలు మాత్రం వేరుగా ఉండొచ్చు.

iPhone 18 Pro కొనాలా.?

మొత్తంగా చూస్తే iPhone 18 Proలో అత్యంత ముఖ్యమైన అప్‌గ్రేడ్స్ వేరియబుల్ అపెర్చర్ కెమెరా, A20 Pro చిప్, మెరుగైన కూలింగ్, ఎక్కువ బ్యాటరీ బ్యాకప్, వేగవంతమైన ఛార్జింగ్, కొత్త కనెక్టివిటీ, 2TB స్టోరేజ్ అని చెప్పొచ్చు. అయితే iPhone 17 Pro ఇప్పటికే ఉన్న యూజర్లకు డిజైన్, డిస్‌ప్లే, అల్ట్రావైడ్ కెమెరా వంటి అంశాల్లో భారీ మార్పులు కనిపించవు. కానీ ఫోటోగ్రఫీ, వీడియో, గేమింగ్, AI పనితీరుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వారికి iPhone 18 Proలోని అప్‌గ్రేడ్స్ ఆసక్తికరంగా ఉంటాయి.