
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ పద్మనగర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణానికి ఎట్టకేలకు మోక్షం లభించింది. ఈ నెల 17న నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. 2023 మే 31న భూమిపూజ నిర్వహించినప్పటికీ, పనులు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు పలుమార్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడిని కలిసి పనులు ప్రారంభించాలని కోరారు.
తాజాగా గంగుల కమలాకర్ మరోసారి చొరవ తీసుకోవడంతో టీటీడీ స్పందించింది. అక్టోబర్ 17న మూల నక్షత్రాన్ని పురస్కరించుకుని ఉదయం 9 గంటల్లోపు పనులకు శ్రీకారం చుట్టనున్నట్లు గంగుల వెల్లడించారు. ఆదివారం టీటీడీ అధికారులతో కలిసి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి, ఏర్పాట్లు, ఆలయ నమూనాలపై చర్చించారు.
టీటీడీ పేరిట పది ఎకరాలు రిజిస్ట్రేషన్..
గత ప్రభుత్వ హయాంలో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ ఆలయ నిర్మాణానికి పద్మనగర్‌లోని 10 ఎకరాల ప్రభుత్వ భూమిని టీటీడీ పేరిట రిజిస్ట్రేషన్ చేయించారు. 2023లో భూమిపూజ అనంతరం టెండర్ల ప్రక్రియ చేపట్టినా, ఎన్నికల నేపథ్యంలో పనులు ముందుకు సాగలేదు. తాజాగా రూపొందించిన ఆలయ నమూనాలు ఆకర్షణీయంగా ఉన్నాయని గంగుల తెలిపారు.
తిరుమల ఆలయాన్ని తలపించే ప్రధాన ద్వారంతోపాటు గర్భాలయం, అర్థమండపం, ముఖమండపం, గరుడాళ్వార్ తదితర నిర్మాణాలతో ఆలయాన్ని తీర్చిదిద్దనున్నట్లు వివరించారు.