
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే కొన్ని చిన్న సరదాలు ఒక్కోసారి ఎంత పెద్ద సమస్యకు దారితీస్తాయో చెప్పడానికి తమిళనాడుకు చెందిన ఓ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ ఉదంతం నిదర్శనంగా నిలిచింది. మదురైకి చెందిన వీరమణి అనే ఇన్‌ఫ్లుయెన్సర్ దీపావళి పండుగ సందర్భంగా తనకు ఎవరో ఒకరు స్వీట్ బాక్స్ పంపించాలంటూ తన అడ్రస్, ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతకుముందు కేరళ టూర్‌కు వెళ్లేందుకు కూడా అతను ఇలాగే సాయం కోరగా ఫాలోవర్లు సుమారు ఆరు వేల రూపాయలు పంపినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈసారి స్వీట్ బాక్స్ అభ్యర్థన అతనికి తీవ్ర తలనొప్పిగా మారింది.
లక్షల విలువైన వస్తువులు, మిలిటరీ ట్యాంక్ ఆర్డర్లు..
వీరమణి పెట్టిన పోస్ట్‌ను సీరియస్‌గా తీసుకోని కొందరు నెటిజన్లు, అతన్ని ఆటపట్టించేందుకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్ ఆన్ డెలివరీ (సీఓడీ) విధానంలో విపరీతమైన ఆర్డర్లు చేయడం ప్రారంభించారు. దీంతో అతని ఇంటికి పాలు, కూరగాయల నుంచి మొదలుకొని టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్ మెషీన్లు, స్మార్ట్‌ఫోన్ల వరకు భారీగా పార్శిళ్లు రావడం మొదలయ్యాయి. ఒక టీవీ ఆర్డర్ విలువ ఏకంగా రూ.1.69 లక్షలు ఉండగా, మరొకరు ఏకంగా కోట్ల విలువైన వస్తువులను కూడా ఆర్డర్ చేసినట్లు సమాచారం. సీఓడీ కావడంతో వస్తువు వచ్చినప్పుడు డబ్బులు చెల్లించాలి.. కానీ తాను వాటిని ఆర్డర్ చేయకపోవడంతో వీరమణి తీసుకోవడానికి నిరాకరించాడు. దీనివల్ల డెలివరీ బాయ్స్‌కు తీవ్ర ఇబ్బందులు ఎదురుకావడమే కాకుండా, నిత్యం వచ్చే ఫోన్ కాల్స్ , పార్శిళ్లతో అతను తీవ్ర మానసిక అశాంతికి గురయ్యాడు.
చివరకు ఇల్లు ఖాళీ చేసి వెళ్లాల్సిన దుస్థితి.. సోషల్ మీడియాలో చర్చ
పరిస్థితి చేయి దాటిపోవడంతో వీరమణి చివరకు కన్నీరుమున్నీరవుతూ, “దయచేసి ఇకపై నా అడ్రస్‌కు ఎలాంటి ఆర్డర్లు పంపించవద్దు” అంటూ మరో వీడియో ద్వారా వేడుకున్నాడు. అయినప్పటికీ నెటిజన్ల వేధింపులు తగ్గకపోవడంతో చేసేది లేక ఆ ఇల్లును ఖాళీ చేసి వేరే ప్రాంతానికి మకాం మార్చాల్సి వచ్చింది. సోషల్ మీడియాలో సరదాగా చేసే ప్రాంక్‌లు , ఆకతాయి చేష్టలు మరొకరి వ్యక్తిగత స్వేచ్ఛను, ప్రశాంతతను ఏవిధంగా హరిస్తాయో ఈ ఘటన కళ్లకు కట్టింది. అంతేకాకుండా, బాధ్యతారహితంగా చేసే ఇలాంటి పనుల వల్ల డెలివరీ సిబ్బంది పడుతున్న శ్రమ, వృథా అవుతున్న సమయంపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.