
- నదికి అడ్డుకట్ట పడి, ఒక్కసారిగా తెగడం వల్లే ఆకస్మిక వరదలు
- హెలికాప్టర్ల ద్వారా సైన్యం సహాయక చర్యలు
ఖాట్మాండు: నేపాల్‌ను మరోసారి భారీ వరదలు ముంచెత్తాయి. గోర్ఖా జిల్లాలోని చుమ్నుబ్రి గ్రామంలో బుఢీ గండకి నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో 35కి పైగా ఇండ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి. ఒక జలవిద్యుత్ ప్రాజెక్టు తీవ్రంగా దెబ్బతిన్నది. కొన్ని నెలల క్రితం సంభవించిన పెను విషాదం మరవకముందే ఈ ప్రమాదం జరగడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
బుఢీ గండకిలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా నీటిమట్టం పెరిగింది. ఉదయం 6:30 గంటలకు 3.66 మీటర్లుగా ఉన్న నీటిమట్టం.. ఉదయం 8:40 గంటలకు ఏకంగా 8.43 మీటర్లకు ఎగబాకింది. సాధారణంగా ప్రమాద హెచ్చరిక స్థాయి 5 మీటర్లు కాగా, కేవలం పది నిమిషాల వ్యవధిలోనే (ఉదయం 8:30 నుంచి 8:40 మధ్య) నీటిమట్టం రెండు మీటర్లకు పైగా పెరిగినట్లు నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ) వెల్లడించింది. నదిలో ప్రవాహం పూర్తిగా నలుపు, బూడిద రంగుల్లో చిక్కటి బురద, చెత్తచెదారంతో ఉప్పొంగి ప్రవహించింది.
నదికి అడ్డుకట్ట తెగిపోవడం వల్లే..
ఈ వరదలకు వర్షాలు కారణంకాదని ఎన్‌డీఆర్‌ఆర్‌ఎంఏ స్పష్టంచేసింది. నదికి ఏదైనా అడ్డుకట్ట పడి, అది ఒక్కసారిగా తెగిపోవడం వల్లే వరదలు సంభవించాని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ఉధృతికి కొలత కేంద్రం, వంతెన కొట్టుకుపోవడంతో వివరాలు సేకరించడం కష్టమైందన్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పేర్కొన్నారు. నది పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. వరద సమాచారం అందుకున్న వెంటనే నేపాల్ సైన్యం సహాయక చర్యలు చేపట్టింది.