Reading Time: 2 minutes

రూ.35 లక్షలు అప్పు చేసి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్.. చివరికి మిగిలింది రూ.69 లక్షలు లాస్!

Caption of Image.

స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కోసం అప్పు చేసి.. నష్టాలపాలై కోలుకోలేని స్థితికి చేరిన ఒక వ్యక్తికి సంబంధించిన స్టోరీ రెడిట్ వేదికగా వైరల్ అవుతోంది. తమిళనాడుకు చెందిన ఒక వ్యక్తి 2021లో సుమారు రూ.35 లక్షలు అప్పుగా తీసుకుని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. అయితే మార్కెట్ క్రాష్ కారణంగా ఆ మొత్తం పూర్తిగా ఆవిరైపోయింది. ఆ తర్వాత ఉద్యోగం కోల్పోవడం, సరైన ఆదాయ వనరు లేకపోవడంతో ఆ అప్పును తీర్చలేకపోయాడు. వడ్డీలు, జరిమానాలు,  ఇతర ఛార్జీలు పేరుకుపోవడంతో 5 ఏళ్ల కాలంలో కట్టాల్సిన అప్పు ఏకంగా రూ.69 లక్షలకు చేరుకుంది.

ఈ ఐదేళ్ల కాలంలో ఆ వ్యక్తి ఎదుర్కొన్న మానసిక క్షోభ వర్ణనాతీతమైనది. అప్పు ఇచ్చినోళ్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్‌ను భయంతో, సమస్యను ఎదుర్కొనే ధైర్యం లేక కాలం గడిపాడు. అప్పటికే తన వద్ద ఉన్న PF సొమ్మును పూర్తిగా ఖర్చు చేశాడు. ఎటువంటి ఆస్తులు, సేవింగ్స్ లేకపోవడంతో ప్రస్తుతం బంధువుల దయపై జీవించాల్సి వస్తోంది. తాను చేసిన తప్పు తన కుటుంబం పాలిట శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల రికవరీ కోసం ఇంటికి వచ్చిన వ్యక్తుల బెదిరింపుల కారణంగా..తన తండ్రి మళ్లీ తాగుడుకు బానిసయ్యాడని, ఆ షాక్ నుంచి కోలుకోలేక కొద్ది రోజులకే తండ్రి కూడా ప్రమాదంలో మరణించాడని ఆ వ్యక్తి కన్నీటిపర్యంతమయ్యాడు.

►ALSO READ | లేఆఫ్స్‌ తప్పించుకున్న టెక్కీలకు నరకం.. ఇద్దరి పని ఒకరితోనే చేయిస్తున్న కంపెనీలు!

అప్పుల పాలవటం అనేది కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా.. అతని ఫ్యామిలీ ప్రశాంతతను, తల్లిదండ్రుల ప్రాణాలను కూడా ఎలా బలి తీసుకుంటుందో ఈ సంఘటన కళ్లకు కడుతోంది. రికవరీ ఏజెంట్ల ఒత్తిళ్లు, బెదిరింపులు మానసిక ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని చెప్పడానికి ఇదొక విషాదకరమైన ఉదాహరణ. ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ఎదుర్కొనే ధైర్యం ఉండాలి తప్ప, పారిపోవడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందని బాధితుడు తన అనుభవం ద్వారా అందరికీ హెచ్చరించాడు.

సమస్య ఎంత పెద్దదైనా సకాలంలో సరైన న్యాయ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. రెడిట్ వినియోగదారులు ఆ వ్యక్తికి పలు సలహాలు ఇస్తూ.. స్థానిక కోర్టుల్లోని లీగల్ ఎయిడ్ సెల్ ను ఆశ్రయించాలని, వ్యక్తిగత దివాలా ప్రక్రియను, చట్టపరమైన మార్గాలను అన్వేషించాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు పారిపోకుండా, చట్టపరమైన హక్కులను తెలుసుకుని ఎదుర్కొవడమే ఏకైక పరిష్కారమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. భారీగా లాభాలు వస్తాయనే ఊహలతో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టి.. అత్యాసకు పోయి అప్పులు చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ఈ ఘటన ప్రతీ ఒక్కరికీ నేర్పిస్తోంది. 

©️ VIL Media Pvt Ltd.