Reading Time: < 1 minute

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే తల్లులకు, పసిపాపలకు తీపి కబురు అందిస్తూ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో నిలిచిపోయిన ప్రసిద్ధ ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకాన్ని పునరుద్ధరిస్తూ అధికారికంగా అమల్లోకి తెచ్చింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులను ప్రోత్సహించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం తగ్గించడమే ధ్యేయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.1,400 విలువైన సమగ్ర కిట్ ఉచితం: ఈ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లో జన్మించిన ప్రతి పసిపాపకు, తల్లికి అవసరమయ్యే రూ.1,400 విలువ చేసే 14 రకాల వస్తువులతో కూడిన కిట్‌ను ప్రభుత్వం ఉచితంగా అందజేస్తుంది. ఇక శిశువు పారిశుధ్యం, ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యుత్తమ నాణ్యత కలిగిన వస్తువులను ఈ కిట్‌లో సమకూర్చారు.

 

కిట్‌లో లభించే ముఖ్యమైన వస్తువులు: పసిపాప సురక్షిత నిద్ర కోసం దోమల తెరతో కూడిన ప్రత్యేక బేబీ బెడ్, రబ్బర్ షీట్, మెత్తని దుస్తులు, టవల్ మరియు ఉతికి మళ్లీ వాడగలిగే 3 బేబీ నేపీలు ఇందులో ఉంటాయి. ఇక వీటితో పాటు శిశువును ఆకట్టుకునే బొమ్మ, నాణ్యమైన బేబీ పౌడర్, షాంపూ, ఆయిల్, సోప్, సోప్ బాక్స్ మరియు ఇవన్నీ భద్రపరుచుకోవడానికి వీలుగా ఒక బ్యాగ్ ఇస్తారు.

తల్లులకు ఊరట.. ఆసుపత్రి కాన్పులకు ప్రోత్సాహం: పురిటిపాపల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువులు ఒకే చోట, అదీ ఉచితంగా లభిస్తుండటంతో బాలింతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ పథకం వల్ల నిరుపేద కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరడమే కాకుండా, ప్రభుత్వ వైద్యశాలల్లో కాన్పుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఇక నవజాత శిశువుల ఆరోగ్యం, తల్లుల సంక్షేమం లక్ష్యంగా పునరుద్ధరించిన ఈ ‘ఎన్టీఆర్ బేబీ కిట్’ పథకం పేద కుటుంబాలకు కొండంత అండగా నిలవనుంది.

గమనిక: ఈ ఉచిత బేబీ కిట్ పథకం కేవలం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు మాత్రమే వర్తిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సమీప ప్రభుత్వ ఆసుపత్రి లేదా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించవచ్చు.

The post ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. నవజాత శిశువులకు ‘ఎన్టీఆర్ బేబీ కిట్’! appeared first on Manalokam – Latest Telugu News & Updates.