Reading Time: 2 minutes
Andhra:  బిచ్చమెత్తిన డబ్బులతో ఆలయానికి  క్యూలైన్లు.. ఎంత గొప్ప మనసు అండి మీది..

సాధారణంగా భిక్షాటనతో వచ్చే డబ్బులను తమ వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడానికే వినియోగిస్తారు. అయితే, త్రిపురాంతకంలోని బాలా త్రిపురసుందరి దేవి ఆలయం వద్ద భిక్షాటన చేసే శివరాముడు రెడ్డియార్ తన విశేషమైన దాతృత్వంతో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొల్లిమలై, నామక్కల్, తమిళనాడుకు చెందిన ఈయన కొన్నేళ్లుగా భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. తన సంపాదన మొత్తాన్ని సమాజ సేవకు, ముఖ్యంగా ఆలయ అభివృద్ధికి వినియోగిస్తూ ఒక గొప్ప మానవతావాదిగా గుర్తింపు పొందారు. మార్కాపురం జిల్లాలోని త్రిపురాంతకం బాలా త్రిపురసుందరి దేవి ఆలయం వద్ద పండుగలు, రద్దీ రోజుల్లో భక్తులు పడే ఇబ్బందులను ఆయన స్వయంగా గమనించారు. లోపలికి వెళ్లేందుకు భక్తులు నెట్టుకుంటూ, తోసుకుంటూ వెళ్లే పరిస్థితిని చూసి చలించిపోయారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలని ఆయన నిర్ణయించుకున్నారు. భక్తుల సౌకర్యార్థం పర్మనెంట్ క్యూలైన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన ఆయనలో కలిగింది. ఈ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడానికి శివరాముడు రెడ్డియార్ ఐదేళ్ల పాటు తనకు వచ్చిన భిక్షాటన సొమ్మును జాగ్రత్తగా కూడబెట్టారు. తన వ్యక్తిగత అవసరాలను అతి తక్కువకు పరిమితం చేసుకున్నారు. ఒకపూటే భోజనం చేసే ఆయనకు కాఫీ, టీ వంటి ఎలాంటి అలవాట్లు కూడా లేవని చెబుతున్నారు. తనకు వచ్చే డబ్బు మొత్తం అమ్మవారి సేవకే వినియోగిస్తానని, తన కోసం తాను పెట్టుకోనని ఆయన స్పష్టం చేశారు.

ఐదు సంవత్సరాల కష్టార్జితం, నిస్వార్థ త్యాగం ఫలితంగా, ఆయన రూ. 1.70 లక్షల వ్యయంతో ఆలయ ప్రాంగణంలో శాశ్వత ఇనుప క్యూలైన్లను నిర్మించారు. ఈ క్యూలైన్లు పండుగల సమయంలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడంలో ఎంతగానో తోడ్పడుతున్నాయి. తాను చేసిన ఈ సేవ అంతా అమ్మవారి ఆశీర్వాదమేనని రెడ్డియార్ పేర్కొన్నారు. “అమ్మవారికి నాకు ఇచ్చినారు ఈ సేవ. ఆ తల్లి నాకు కనిపించింది నేను చేసినాను” అని ఆయన తన వినమ్రతను చాటుకున్నారు. ఐదు సంవత్సరాల కిందనే కూడబెట్టిన డబ్బుతో ఈ క్యూలైన్లను నిర్మించానని, ఇంకా చేయాలని కోరిక ఉందని తెలిపారు. అమ్మ ఆశీర్వదిస్తే కచ్చితంగా మరిన్ని సేవలు చేస్తానని ఆయన చెప్పారు. గతంలో శివరాత్రి వంటి పండుగలప్పుడు కర్రలు పెట్టి క్యూలైన్లు ఏర్పాటు చేసేవారని, ఆ ఇబ్బందులను తొలగించి శాశ్వత పరిష్కారం చూపాలని తనకు అమ్మవారి ఆలోచన వచ్చిందని ఆయన వివరించారు. భవిష్యత్తులో ఆలయ ప్రధాన రహదారి వద్ద స్వాగత తోరణం ఏర్పాటు చేయాలని కూడా శివరాముడు రెడ్డియార్ యోచిస్తున్నారు. ఈ మహత్తర కార్యానికి కూడా తన భిక్షాటన సొమ్మునే వినియోగించాలనుకుంటున్నారు. తన జీవితాన్ని, తన సంపాదనను పూర్తిగా అమ్మవారి సేవకు, భక్తుల సౌకర్యానికి అంకితం చేసిన శివరాముడు రెడ్డియార్ కథ నిజంగా స్ఫూర్తిదాయకం. ఆయన నిస్వార్థ సేవ, మానవత్వంపై ఆయనకు ఉన్న నమ్మకాన్ని, భక్తిని చాటుతున్నాయి.