Reading Time: < 1 minute
Hyderabad: హైదరాబాద్‌లో అవినీతి తిమింగళం.. 20లక్షల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తహసీల్దార్..

హైదరాబాద్ అవినీతి అధికారుల లీలలు మరోసారి బట్టబయలయ్యాయి. లేఔట్ అనుమతుల కోసం ఏకంగా లక్షల్లో డిమాండ్ చేసిన అధికారులపై అవినీతి నిరోధక శాఖ పంజా విసిరింది. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ బండారు సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు రూ.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండల పరిధిలోని ఒక లేఔట్‌కు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన, సర్వే రిపోర్ట్ జారీ చేయాల్సి ఉంది. ఇందుకోసం తహశీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులు బాధితుడిని ఏకంగా రూ.30 లక్షల లంచం డిమాండ్ చేశారు. అంత మొత్తం ఇచ్చుకోలేనని బాధితుడు ప్రాధేయపడటంతో చివరకు రూ.20 లక్షలకు డీల్ కుదుర్చుకున్నారు.

లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధితుడు వెంటనే ఏసీబీ ఉన్నతాధికారులను ఆశ్రయించి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదును పరిశీలించిన అధికారులు పక్కా ప్లాన్ ప్రకారం రంగంలోకి దిగారు. తహసీల్దార్ కార్యాలయంలో సర్వేయర్ సమక్షంలో తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి బాధితుడి నుంచి రూ.20 లక్షల నగదు తీసుకుంటుండగా ఏసీబీ టీమ్ మెరుపు దాడి చేసి వారిని అదుపులోకి తీసుకుంది. సదరు అధికారులకు ఆదాయానికి మించిన ఆస్తులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. అరెస్టయిన తహసీల్దార్ సుదర్శన్‌రెడ్డి, సర్వేయర్ శ్రీనివాసులను నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.