
- పాలకుల కుట్రలపై టీచర్లు, విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలి
- మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ
హైదరాబాద్, వెలుగు: కులం, మతం, ప్రాంతం, లింగం పేరిట విద్వేషాలు రెచ్చగొట్టి పాలకుల పబ్బం గడుపుకుంటున్నారని.. అలాంటి విభజన రాజకీయాలు ప్రజల ఐక్యతను దెబ్బతీసి ప్రజా ఉద్యమాలను నిర్వీర్యం చేస్తాయని మాజీ ఎమ్మెల్సీ ఎంవీఎస్ శర్మ అన్నారు. ఈ ప్రతీఘాత శక్తుల పట్ల అప్రమత్తంగా ఉంటూ, చైతన్యాన్ని టీచర్లు, విద్యార్థులకు కల్పించాలని పిలుపునిచ్చారు. సోమవారం యూటీఎఫ్ స్టేట్ ఆఫీసులో ఎస్టీఎఫ్‌ఐ దక్షిణాది రాష్ట్రాల టీచర్ల శిక్షణా తరగతుల్లో భాగంగా ఆయన మాట్లాడారు.
మతం ఆధారంగా ప్రజలను విభజించడం సులభమని, ఏ మతమూ ద్వేషాన్ని బోధించకపోయినా.. రాజకీయ లబ్ధి కోసమే ఉద్దేశపూర్వకంగా రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ఎస్టీఎఫ్‌ఐ ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో 25 సంఘాలు ఎస్టీఎఫ్‌ఐకి అనుబంధంగా పనిచేస్తున్నాయని తెలిపారు.