Reading Time: 2 minutes
Goutham Raju: గౌతమ్ రాజు ఆ జబ్బుతో బాధపడుతున్నారా? వీడియో రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చిన టాలీవుడ్ నటుడు

ఈ మధ్యన ఎవరైనా సెలబ్రిటీలు కొద్ది రోజులు కనిపించకపోతే చాలు వారిపై రకరకాల రూమర్లు రావడం సాధారణమైపోయింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు కనిపించకపోతే చాలు.. వారు చనిపోయారంటూ, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తుంటారు. ఈ కారణంగానే ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు తాము చనిపోలేదని, బతికే ఉన్నామంటూ స్వయంగా చెప్పుకుంటున్న పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా సీనియర్ నటుడు, కమెడియన్ గౌతమ్ రాజుకు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇప్పుడీ నటుడు పెద్దగా సినిమాలు చేయడం లేదు. పైగా ఎలాంటి ఇంటర్వ్యూల్లోనూ కనిపించడం లేదు. దీంతో గౌతమ్ రాజుపై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఈ సీనియర్ నటుడు కిడ్నీ వ్యాధి తో బాధపడుతున్నారంటూ రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ పుకార్లు నెట్టింట వైరల్ గా మారడంతో చాలా మంది వీటిని నిజమేననుకుంటున్నారు. దీంతో ఈ తప్పుడు వార్తలపై గౌతమ్ రాజు స్పందిస్తూ ఒక వీడియో విడుదల చేశారు.

ఈ వీడియో లో గౌతమ్ రాజు మాట్లాడుతూ.. ‘ఇటీవల కాలంలో నేను ఎలాంటి ఇంటర్వ్యూలలో పాల్గొనలేదు కానీ ఒక సోషల్ మీడియా అకౌంట్లో మాత్రం నా గురించి తప్పుడు వార్తలు రాశారు. నేను కొన్ని వందల సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు లేని సినిమాలలో నటించానని కూడా వార్తలు రాశారు. ఇలా నా సినిమాల గురించే కాకుండా చివరిలో నేను అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానంటూ వార్తలు రాయడం చాలా బాధగా అనిపించింది. నాకు కిడ్నీ సమస్యలు ఉన్నాయని వార్తలు రాయడం దారుణం. నేను పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నాను. నాకెలాంటి అనారోగ్య సమస్యలు లేవు. దయచేసి ఇలాంటి తప్పుడు వార్తలను ఎవరు కూడా ప్రచారం చేయొద్దు’ అని కోరారు. ప్రస్తుతం ఈ సీనియర్ నటుడు రిలీజ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

కాగా గౌతమ్ రాజు సుమారు 200 పైగా సినిమాలలో నటించి మెప్పించారు. ఘరానా మొగుడు, కూలి నెంబర్ 1, ప్రేమకు వేళాయెరా, రెడీ, సుప్రీమ్, గబ్బర్ సింగ్, రాజేంద్రుడు గజేంద్రుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం తదితర సూపర్ హిట్ సినిమాలు ఈ నటుడికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఇక బుల్లితెరపైనా పలు సూపర్ హిట్ సీరియల్స్ లో నటించారు గౌతమ్ రాజు.

గౌతమ్ రాజు రిలీజ్ చేసిన వీడియో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.