
ఇది వినటానికి సైన్స్ ఫిక్షన్ మూవీలో సన్నివేశంగా ఉన్నప్పటికీ.. రియల్ లైఫ్ క్రైమ్. జర్మనీలోని కొలోన్ నగరంలో టెక్నాలజీ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఒక విచిత్రమైన, వివాదాస్పదమైన ఘటన వెలుగు చూసింది. సాధారణంగా టెక్నాలజీ మనుషులకి సాయం చేయాలి. కానీ ఇక్కడ ఒక రోబో మాత్రం వీధుల్లో వెళుతున్న అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడటం సంచలనం సృష్టించింది. అసలు టెక్నాలజీ ఏ స్థాయికి దిగజారిందో తెలుసుకుందాం రండి..
కొలోనిలోని ఒక ప్రసిద్ధ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ బయట 16 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి నిలబడి ఉంది. సరిగ్గా అదే సమయంలో అక్కడకు వచ్చిన ఒక ఎరుపు, బంగారు రంగుల్లో ఉన్న రోబో.. ఒక్కసారిగా వెనుక నుండి ఆ బాలిక దగ్గరకు వెళ్ళింది. అందరూ చూస్తుండగానే ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ.. తన బాడీ పార్ట్స్‌ను తాకుతూ లైంగిక చేష్టలు చేసింది. టెక్నాలజీతో నడిచే ఒక యంత్రం ఇలా చేయడం చూసి అక్కడున్న వారంతా షాక్‌కు గురయ్యారు.
అయితే ఈ వికృత చేష్ట అంతటితో ఆగలేదు. ఆ రోబోట్ యజమాని అయిన 16 ఏళ్ల బాలుడు.. అతని 19 ఏళ్ల స్నేహితుడు ఈ మొత్తం ఘటనను తమ మొబైల్స్‌లో రికార్డ్ చేశారు. అక్కడితో ఆగకుండా ఈ మెుత్తం సన్నివేశాన్ని సోషల్ మీడియాలో లైవ్‌స్ట్రీమ్ చేస్తూ దానిపై పిచ్చిపిచ్చి కామెంట్లు ఇస్తూ ఎంజాయ్ చేశారు. లైక్స్, వ్యూస్ కోసం ఒక మైనర్ అమ్మాయిని వేధింపులకు గురిచేయటంపై నెటిజన్లు మండిపడుతున్నారు.
ఈ దారుణంపై సమాచారం అందుకున్న కొలోన్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. మాగ్నుస్‌స్ట్రాస్, హోహెన్‌జోల్లెరింగ్ కూడలి సమీపంలో నిందితులను గుర్తించిన పోలీసులు.. వారి కారు డిక్కీ లో దాచిపెట్టిన రోబోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల ఫోన్లను కూడా సీజ్ చేశారు. ప్రస్తుతం ఈ రోబోట్‌ను రిమోట్ ద్వారా ఎవరు ఆపరేట్ చేశారు అనే దానిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. టెక్నాలజీని ఇలాంటి చిల్లర పనులకు ఉపయోగించకుండా అడ్డుకోవాల్సిన అవసరాన్ని తాజా ఘటన అలర్ట్ చేస్తోంది.