Reading Time: 3 minutes

తోక తెగిన పిట్ట.. కనుమరుగవుతున్న ఉత్తరాలు..జ్ఞాపకాలుగా మిగిలిన పోస్టుబాక్సులు!

Caption of Image.

80వ దశకం.. మనం అప్పుడు పుట్టలేదు కానీ 1854లో అనుకుంటా.. తెల్ల దొరలు దేశాన్ని ఏలుతున్న కాలం అది. పేద ప్రజల అవసరాలకో.. లేక వారి ప్రయోజనాలకో.. తెలియదు కానీ పల్లెల్లో పోస్ట్ బాక్స్లు పెట్టించారు. సరిహద్దుల్లో పహారకాస్తున్న వీరుడికి.. కోటి ఆశలతో ఎదురు చూసే నిరుద్యోగికి.. మనసులో మాటని నోరువిప్పి చెప్పలేక కవిత కవిత్వంతో రాసిన ప్రేమ భావాన్ని.. పండగ సెలవులకు బిడ్డ అల్లుడిని రమ్మని పంపే కబురును.. క్యాంటీన్‌ ఖర్చులకు, పుస్తకాల ఖర్చులకు పైసల కోసం నాన్నకు ఉత్తరం రాసే కొడుకు బిడ్డలకు.. ఇలా ఏ భాషలో రాసినా ఆ భావాలను అందించే లేఖ ఇప్పుడు దూరం అయింది. మారుతున్న కాలంతోపాటే కాలగమనంలో కలిసి పోయింది. తోక తెగిన పిట్టలా తుర్రుమంటూ ఎగిరిపోయింది. కానీ నేటికి కొన్ని గ్రామాల్లో గోడలకు ఇంట్లో ముసలి అవ్వలా పోస్టు బాక్సులు దర్శనమిస్తూనే ఉంటాయి.
 
నాకు బాగా గుర్తు మా చిన్న తనాన.. మా అమ్మమ్మ (వెల్మకంటి పిచ్చమ్మ)కు వాళ్ల అక్కకొడుకు తండు మల్లయ్య (ప్రస్తుత రిటైర్డ్​ టీచర్..) కోదాడలో జాబ్ చేస్తున్న సమయంలో రెండు మూడు వారాలకు ఒక సారి ఉత్తరం రాసేవారు.. అదేందో ఉత్తరాలు ఇచ్చే రెడ్డిగారు మాత్రం రెండు మూడు ఉత్తరాలు ఒకేసారి పట్టుకొచ్చేవారు.. మండలం నుంచి మా ఊరికి మూడు కిలోమీటర్లు.. మళ్లీ మళ్లీ రాలేకనో.. మూడు కిలో మీటర్లు సైకిల్ తొక్కలేకనో తెలియదు కానీ.. ఆ ఉత్తరాలు చూసిన మా అమ్మమ్మ ముఖంలో ఆనందం ఇప్పటికి నా కండ్ల ముందు కనపడుతూనే ఉంటుంది..

ఉత్తరాలను చూడగానే ఇంట్లో పనికి పక్కేసేది.. పక్క మీద గుర్క పెడుతూ కునుకు తీస్తున్న నన్ను మాత్రం నిద్ర లేపేది.. ఆత్రం ఆత్రంగా ఉత్తరం పట్టుకొచ్చి చదువు బిడ్డా మామయ్య ఏం రాశాడో అనేది.. నాకేమో బయటకు చదవాలంటే సిగ్గు.. చల్ నేను బయటికి చదవను.. మొత్తం చదివిన తర్వాత నీకు చెప్తాను అనేవాడిని.. చదువుకున్నోని కంటే బర్ల కాసేవాడు మేలు అని తిట్టుకుంటూ మా వాడలో నాకంటే పెద్ద వాళ్ల దగ్గరకు ఉరికేది.. వారు చదివి వినిపిస్తుంటే మురిసిపోయేది.. ఆ ఆత్రం.. ఆ ఆనందం.. ఉత్తరం చూడగానే తన కష్టాలను మరిచిపోయి ఆనందంతో వెలిగిపోయే ఆ క్షణాలు మరుపు రానివి.. మరవలేనివి.. గమ్మతేందంటే.. మళ్లీ ఉత్తరం గడపల్లకు వచ్చేవరకు గడప గడపకు చెప్పేది మా మల్లయ్య నాకు ఉత్తరం రాశాడు అని.. అదో ఆనందం మరి.

దులుతున్న కాలంతో మనం..

కాల క్రమేనా రోజులు మారుతూ వచ్చాయి.. టెక్నాలజీ పెరిగింది.. ఊరి పొలిమేరలోకి లాండ్ ఫోన్లు వచ్చాయి.. ఊరిలో నాలుగే ల్యాండ్ పోన్లు.. నాడ దొరికిందని గోడ కోసం వెతికినట్టు.. నాలుగు ల్యాండ్ పోన్ల కోసం నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి కేబుల్ వైర్ లాగారు మా ఊరికి.. కాలం ఎప్పుడు ఒకే దగ్గర ఆగదు కదా. టెక్నాలజీ రోజుకో మెట్టు ఎక్కతూ గాలితో మాటలు పంపడం స్టార్ట్ చేసింది. మళ్లీ కొన్నాళ్లకు ఆండ్రాయిడ్ పోన్లు.. మొబైల్ డేటా.. నేడు ఏడేడు సముద్రాల అవతల ఉన్న వ్యక్తి కూడా పక్కనే కూర్చోని పలకరించినట్టు వీడియో కాల్స్.. అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని, ఉత్తరాలు చదవడం దగ్గర నుంచి, టెలిఫోన్ డైరెక్టరీ చూడడం వరకు అనేక పనుల అవసరం ఇప్పుడు జనాలకు లేకుండా పోయింది.. ఊర్లో ఎవ్వరైనా ప్రభుత్వ ఉద్యోగానికి పరీక్షలు రాస్తే ఉత్తరం ఒచ్చే వరకు వెయ్యి కండ్లతో ఎదురు చూసేవారు.. తెల్లారి పేపర్లో వస్తే కానీ ఊరి జనానికి తెలిసేది కాదు. కానీ ఇప్పుడు క్షణాల్లో సమాచారం.. ముచ్చట మూల మల్లకముందే వార్త ఊరంతా తిరిగొస్తుంది. దరిద్రం ఏంటంటే ఆనాటి కాలంలో ఊరిలో ఒకరికి ఆపతి వస్తే ఊరంతా చుట్టాలు అయ్యేవారు. ఇప్పుడు కండ్ల ముందు ప్రాణాలు పోతున్నా వీడియోల మీద ఉన్న ధ్యాస పోతున్న మనిషి ప్రాణం మీద లేకుండా పోయింది.

వెబ్ ప్రపంచం ఆవిష్కృతమైన దరిమిలా, లోగడ ప్రజలు అలవాటు పడిన అనేక పరికరాల అవసరం నేటి ప్రపంచంలో లేకుండాపోయింది.. ఏదైనా ఫోను నెంబరు కావాల్సివస్తే, టెలిఫోన్ డైరెక్టరీతో పనిపడేది. ఇప్పుడు వాటిని చూసేవారే లేరు. పోస్ట్ కార్డులు, పబ్లిక్ టెలిఫోన్ బాక్సులు, ఫోటో ప్రింటింగ్, టెలిఫోన్ నెంబర్లను గుర్తుగా రాసుకునే చిన్నిచిన్ని పుస్తకాలు క్రమంగా కనుమరుగైపోయాయి. ఫిలిం షో టైమింగులు చెక్ చేసుకోవడానికి పేపర్లు తిరగేసేవారు.. ఇప్పుడు అరచేతిలోనే ప్రపంచాన్ని చూసే పరికరం. బుక్ మై షో తెరిస్తే అన్ని అండ్లనే.. చెప్పడం కాదు కానీ రెండు దశాబ్దాల క్రితం వరకు ప్రజలు పోస్టు బాక్సులతో, ఉత్తరాలతో విడదీయరాని బంధాన్ని పెనవేసుకున్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. బంధువులకు, స్నేహితులకు రాసిన ఉత్తరాలు, గ్రీటింగ్ కార్డ్స్, అభిమాన రచయితలకు, సినీతారలకు రాసిన లెటర్స్, ఊరు, పేరు లేకుండా రాసే ఆకాశరామన్న ఉత్తరాలను పోస్టు బాక్సుల్లో పడేస్తే.. చేరవలసిన చోటుకు చేరేవి.. అందాల్సిన వాళ్లకు అందేవి.. ప్రేమలేఖలు పోస్ట్ బాక్సులో పంపే వారు కూడా ఉన్నారు అనుకోండి అది వేరే విషయం.

నాటి పోస్టు బాక్సులు.. నేటి దిష్టి బొమ్మలు..!

స్వాతంత్య్ర ఉద్యమానికి, గెరిల్లా పోరాటాలకు, సాహితీ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచిన ఉత్తరం కాలగర్భంతో కలిసి పోయి, పోస్టు బాక్సులు దిష్టిబొమ్మలుగా మిగిలాయి. ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని, విషాదాన్ని, ప్రేమను నింపి సుదూర ప్రాంతాల్లో ఉన్న ఆత్మీయుల అనుభూతులను, ప్రేమలను, ఆశీర్వాదాలను, మోసుకొచ్చే ఉత్తరం నేడు కాలక్రమంలో కానరాకుండా పోయింది.. ఉత్తరాలకు బదులుగా మెయిల్స్.. కాగితం మీద రాసే అక్షరాలకు బదులు వాయిస్ మెసేజ్​లు.. వాట్సప్​లో స్టేటస్​లు.. ఫేస్​బుక్​లో పోస్టులు.. ఇన్​స్టాలో రీల్స్.. దరిద్రం ఏందంటే కన్న తండ్రి చనిపోతే ఆఖరి కార్యాన్ని కూడా వీడియో కాల్స్​లో చూసే దౌర్భాగ్యపు కాలాన్ని తయారుచేసుకున్నది కూడా మనమే.. సులువు పనులకు అలవాటు పడిన జనం (మనం) జీవితానికి, అనుబంధాలకు, ఉత్తరం కిటికీ లాంటిది అనే సత్యాన్ని మరిపోతున్నాం.. మరిచిపోయాం కూడా.. ఉత్తరం అంటే నాలుగు వాక్యాలు, నాలుగు మడతల పేజీలు అనుకోవచ్చురు.. మాటలకందని భావాలను పొందుపరిచే ప్రయోగశాల అనే విషయాన్ని గుర్తుంచుకోలేకపోతున్నాం.. టెక్నాలజీ పెరిగినందుకు, క్షణాల్లో సమాచారం అందుతున్నందుకు సంతోష పడాలో.. మనిషికి మనిషికి నడుమ దూరం పెరిగినందుకు బాధపడాలో అర్ధం కావడం లేదు.. తాత్కాలిక ఆనందాన్ని, సమాచారాన్ని మాత్రమే ఇవ్వగలిగే సెల్ ఫోన్ల మోజులో పడి సాహిత్య సామ్రాజ్యాన్ని ఏలిన ఉత్తరాన్ని మరిచిపోతున్నాం మనం.. నింగిలో ఎగిరిన తోక తెగిన పిట్ట మళ్లీ మంచిచెడ్డలు మోసుకొస్తుందని ఆశిద్దాం. 

– రేసు మల్లేష్ గౌడ్
జర్నలిస్ట్
 

©️ VIL Media Pvt Ltd.