Reading Time: 2 minutes
Gyanesh Kumar Family Ias Ips Doctors Civil Services

Gyanesh Kumar Family: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌ చుట్టూ వివాదం నడుస్తోంది. ఆయన తన పదవికి రాజీనామా చేయాలని ఇటు ప్రతిపక్షం కాంగ్రెస్, సీజేపీ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఢిల్లీ సహా దేశ వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నాయి. ఈ నేపథ్యంలో జ్ఞానేశ్ కుమార్ కుటుంబ గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. జ్ఞానేశ్ ఫ్యామిలీ దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యధిక చదువులు చదివిన కుటుంబాల్లో అగ్రస్థానంలో నిలుస్తోంది. కేరళ కేడర్‌కు చెందిన 1988 బ్యాచ్ మాజీ ఐఏఎస్ అధికారి, ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థి అయిన జ్ఞానేశ్ కుమార్ దేశంలో అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఈ హై-ప్రొఫైల్ కుటుంబం నుంచి దాదాపు 28 మంది వైద్యులు, ముగ్గురు ఐఏఎస్‌లు, ఒక ఐపీఎస్, ఒక ఐఆర్‌ఎస్ అధికారి దేశానికి సేవలు అందిస్తున్నారు. ఈ కుటుంబంలో ఎవరి నేపథ్యం చూసినా ఆశ్చర్యపోవాల్సిందే.

జ్ఞానేశ్ కుమార్ తండ్రి దివంగత డాక్టర్ సుబోధ్ కుమార్ గుప్తా ఉత్తరప్రదేశ్ ఆరోగ్య శాఖలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO)గా, చీఫ్ మెడికల్ సూపరింటెండెంట్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన తల్లి సత్యావతి గుప్తా యోగ, ఆధ్యాత్మిక రంగాలతో అనుబంధం కలిగి ఉన్నారు. ఇక జ్ఞానేశ్ కుమార్ సోదరుడు మనీష్ కుమార్ ఐఆర్‌ఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఆయన సోదరి రోలి ఇండోర్ లో ఒక పాఠశాలను నిర్వహిస్తుండగా, ఆమె భర్త ఉపేంద్ర జైన్ మధ్యప్రదేశ్ కేడర్‌కు చెందిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి. వీరే కాకుండా ఈ కుటుంబంలో మేనమామలు, ఇతర బంధువులు కలిపి మొత్తం 28 మంది వైద్య వృత్తిలో కొనసాగుతూ వైద్య రంగంలో విశేష సేవలందిస్తున్నారు.

ఇక జ్ఞానేశ్ కుమార్ పెద్ద కుమార్తె మేధా రూపం, అల్లుడు మనీష్ బన్సల్ ఇద్దరూ సివిల్ సర్వీసెస్ అధికారులే. ఢిల్లీ యూనివర్సిటీలోని ప్రసిద్ధ సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో ఎకనామిక్స్ ఆనర్స్‌ పూర్తి చేసిన మేధా రూపం, యూపీఎస్సీ పరీక్షలో ఆలిండియా 10వ ర్యాంకు సాధించి 2014 బ్యాచ్ ఉత్తరప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారిగా ఎంపికయ్యారు. అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలతో పాటు ఆమె మంచి షూటింగ్ ఛాంపియన్ కూడా. రాష్ట్ర స్థాయిలో పలు రికార్డులు సృష్టించిన ఆమె ప్రస్తుతం నోయిడా జిల్లా కలెక్టర్‌గా (DM) బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమె భర్త, జ్ఞానేశ్ కుమార్ పెద్ద అల్లుడు మనీష్ బన్సల్ కూడా 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారే. ఐఐటీ దిల్లీలో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ఆయన యూపీఎస్సీలో 53వ ర్యాంకు సాధించారు. ఎల్బీఎస్‌ఎన్ఏఏలో ట్రైనింగ్ సమయంలో మేధా రూపం, మనీష్ బన్సల్‌ల పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆగ్రా జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వర్తించారు.

జ్ఞానేశ్ కుమార్ చిన్న కుమార్తె అభిశ్రీ కూడా పెద్ద కుమార్తె లాగే సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలోనే చదువుకున్నారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించి 2017 బ్యాచ్ ఐఆర్‌ఎస్ (IRS) అధికారిగా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. ఆమె భర్త, జ్ఞానేశ్ కుమార్ చిన్న అల్లుడు అక్షయ్ లబ్రూ జమ్మూకశ్మీర్‌కు చెందినవారు. 2016 యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించి ఐఏఎస్ అయిన అక్షయ్ లబ్రూ, అభిశ్రీ లాగే 2017 బ్యాచ్ సివిల్ సర్వెంట్. ప్రస్తుతం ఆయన జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్ జిల్లా మేజిస్ట్రేట్ కమ్ డిప్యూటీ కమిషనర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇలా ఒకే కుటుంబం నుంచి దేశ అత్యున్నత సేవలైన సివిల్స్, మెడికల్ రంగాల్లో పలువురు రాణిస్తుండటం విశేషం.