
సికింద్రాబాద్ బొల్లారం పరిధిలోని కౌకూర్ ఆర్కిడ్ విల్లాస్‌లో జరిగిన ఐదేళ్ల చిన్నారి అరేలియా కిడ్నాప్, హత్య ఉదంతం అత్యంత విషాదకరంగా ముగిసింది. విల్లాలో అగ్రికల్చర్ సైంటిస్ట్ మిల్టన్ ఫెర్నాండెజ్ కుమార్తె అయిన అరేలియా, అక్టోబర్ 9న బతుకమ్మ వేడుకలు జరుగుతుండగా ఆడుకుంటూ అదృశ్యమైంది. చిన్నారి వెనుకే మాజీ సెక్యూరిటీ గార్డు విక్రమ్ వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ప్రవర్తన సరిగా లేదనే కారణంతో విక్రమ్‌ను వారం క్రితం సొసైటీ యాజమాన్యం ఉద్యోగం నుంచి తొలగించింది. ఆ కక్షతోనే అతడు పక్కా ప్లాన్ ప్రకారం చిన్నారిని కిడ్నాప్ చేశాడు. కిడ్నాప్ సమయంలో చిన్నారి అరుపులు బయటకు వినిపించకుండా విలాస్‌లో ఎలక్ట్రిషియన్‌ను పెద్ద సౌండ్ స్పీకర్ పెట్టమని కోరాడు.
చిన్నారిని విడిచిపెట్టాలంటే రూ.20 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విక్రమ్ మరో సెక్యూరిటీ గార్డు వద్ద ఉన్న మొబైల్ ఫోన్ నుంచి పాప తండ్రికి, తాతకు వేర్వేరుగా ఫోన్ కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు వీడియో కాల్‌లో చిన్నారిని చూపించాలని కోరడంతో, భయపడిపోయిన నిందితుడు పాపను బయటకు తీసుకెళ్లలేక, పోలీసులు వస్తారనే ఉద్దేశంతో దారుణానికి ఒడిగట్టాడు. చిన్నారి చేతులు, కాళ్లు కట్టేసి, నడుముకు రెండు ఇటుకలు కట్టి విల్లా ఆర్కిడ్ క్లబ్ హౌస్ సెల్లార్‌లోని వాటర్ సంప్‌లో పడేసి హత్య చేశాడు. చిన్నారి మృతదేహం సెల్లార్‌లో విగతజీవిగా లభించింది.
ఈ దారుణంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసి పది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విక్రమ్‌కు సహకరించిన మరో సెక్యూరిటీ గార్డ్, ఎలక్ట్రిషియన్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు, బాల్‌నగర్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల లాడ్జీలు, హోటళ్లలో తనిఖీలు నిర్వహించారు. చివరకు మల్కాజ్‌గిరి స్పెషల్ టీమ్ పోలీసులు సిటీ శివారులోని రైల్వే స్టేషన్ వద్ద నిందితుడు విక్రమ్‌ను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి కుటుంబ సభ్యులు నిందితుడిపై అత్యంత కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.