Reading Time: < 1 minute
Ys Jagan Reviews Ysrcp Mayor And Municipal Chairperson Candidates

YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలపై అన్ని పార్టీలు కసరత్తు చేస్తున్నాయి.. రిజర్వేషన్లు కూడా ఖరారు కావడంతో.. అభ్యర్థుల వేటలో పడిపోయారు నేతలు.. ఇక, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) రీజనల్ కోఆర్డినేటర్లతో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నిర్వహించిన సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దాదాపు ఆరు గంటల పాటు ఈ సమావేశం కొనసాగింది. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున బరిలోకి దిగే అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా చర్చ జరిగింది..

ఈ సమావేశంలో వైఎస్‌ జగన్ జిల్లాల వారీగా నేతలతో ముఖాముఖి నిర్వహించారు. మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై పార్టీ నేతలతో కసరత్తు చేశారు. వివిధ జిల్లాల్లో అభ్యర్థుల పరిస్థితి, స్థానిక రాజకీయ సమీకరణాలు, గెలుపు అవకాశాలపై చర్చించారు.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో పాటు పరిశీలకులు అందించిన అభ్యర్థుల వివరాలను జగన్ క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాల వారీగా అందిన అభ్యర్థుల డేటాపై నేతలతో సుదీర్ఘంగా చర్చించారు. ఎవరిని బరిలోకి దింపితే విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే అంశంపై అభిప్రాయాలు తీసుకున్నారు వైఎస్ జగన్..

ఇక, ఇప్పటికే నెల్లూరు మేయర్ అభ్యర్థిగా ఆనం విజయకుమార్ రెడ్డి పేరును ఖరారు చేశారు వైఎస్‌ జగన్.. మిగిలిన నగరాలు, పట్టణాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై చర్చలు కొనసాగాయి. అన్ని అంశాలను పరిశీలించిన అనంతరం అభ్యర్థుల జాబితాను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఒకటి, రెండు రోజుల్లోనే మిగిలిన అభ్యర్థుల పేర్లను కూడా ఖరారు చేసే అవకాశమున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.. దీంతో వైసీపీలో మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల అభ్యర్థుల ఎంపికపై ఉత్కంఠ నెలకొంది.